కన్నడ ‘పొత్తు’లు
కర్నాటకలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ .. ఆపరేషన్ హస్తం ప్రారంభించింది. విపక్షాల్లోని అసంతృప్తనేతలకు ఎరవేస్తోంది. ఆపరేషన్ హస్తానికి కౌంటరివ్వలేక విపక్ష బీజేపీ విలవిలలాడుతోంది. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లో కర్నాటక నుంచి వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. దీంతో కర్నాటకలో రాజకీయం మరింత వేడెక్కింది.
దీనికి తోడు ఇండియా కూటమి రోజురోజుకూ బలోపేతమవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ ను గద్దెదించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. దీంతో టార్గెట్-2024 లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్‌తో(JDS) బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. మాండ్యా, హసన్, బెంగళూరు(రూరల్), చిక్బల్లాపూర్ సీట్లను జేడీఎస్ కోరుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2019లో ఈ నాలుగు స్థానాల్లో మూడింట బీజేపీ గెలవగా.. కేవలం హసన్‌లో మాత్రమే జేడీఎస్ గెలిచింది.
2019 ఎన్నికల్లో జేడీఎస్ 10 శాతం కంటే తక్కువ ఓటు షేరును పొందింది. ఈ ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 14 శాతం ఓట్లకే పరిమితమైంది. రోజురోజుకూ జేడీఎస్ గ్రాఫ్ పడిపోతోంది. సాక్షాత్తూ అధినేతలే గెలవలేని దుస్థితి దాపురించింది. ప్రజల్లో కూడా జేడీఎస్ తీరుపై అనుమానాలున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఆపార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని భావిస్తున్న కన్నడీయులు.. ఎన్నికల్లో జేడీఎస్ ను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక జేడీఎస్‌తో అవగాహన బీజేపీకి కూడా చాలా కీలకం కానుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కన్నడ బీజేపీకి నాయకత్వ లేమి వెంటాడుతోంది. మాజీ సీఎం యెడియూరప్ప .. అలా కనిపించడం తప్ప,రాజకీయంగా పెద్దగా పట్టించుకోవడం లేదు . అంతా.. హైకమాండ్ చూసుకుంటోంది. దీంతో బీజేపీలోని నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితున్నాయి. వారు జంప్ కాకుండా చూసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటిగా కనిపిస్తోంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కర్నాటక నుంచి అధిక సీట్లను గెల్చుకోవడంపై కమలనాథులు కన్నేశారు. అందులో భాగంగానే జేడీఎస్‌తో అవగాహన కుదుర్చుకుందనే టాక్ వినిపిస్తోంది.













