అమెరికా పౌరసత్వం వచ్చేస్తోందహో…
అమెరికాలో శాశ్వత నివాసం చాలా మందికి దశాబ్దాల స్వప్నం. దీనికోసం ఒకొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తారు. కొందరు కంపెనీలద్వారా రిక్రూటింగ్ ప్రొసెస్ లో అక్కడికి వెళ్లి, నెమ్మదిగా గ్రీన్ కార్డుకోసం అప్లై చేసుకుని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు అమెరికన్లుగా స్థిరపడతారు. మరికొందరు అమెరికా చట్టం ఇచ్చిన అవకాశాలను వాడుకుని, లక్ష్యాన్ని రీచ్ అవుతారు. ఇందులో ఎక్కువమంది అనుసరిస్తున్న విధానం అమెరికన్ ను పెళ్లాడి, వారి ద్వారా అక్కడి పౌరసత్వాన్ని సాధించడం. అయితే ఇటీవలి కాలంలో అది కూడా కష్టమైపోయింది. ఎందుకంటే అమెరికన్లను వివాహం చేసుకుని, అక్కడే ఉన్న 11 లక్షల మంది అమెరికన్ లు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు.
తమకు అమెరికా పౌరసత్వం రాకపోతుందా అని అక్కడే ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే.. అధికారికంగా అన్నిపత్రాలు ఉన్నప్పటికీ ఏటా వీరిసంఖ్య పెరిగిపోతుండడంతో… శాశ్వత పౌరసత్వం చాలా ఆలస్యమైపోతోంది. దీంతో ఎక్కడ తమను తిప్పిపంపుతారో అన్న భయం కొందరిలో కనిపిస్తోంది. మరికొందరు మాత్రం…ఇవ్వకపోతే అదైనా చెబితే, తమ తిప్పలేవో తాము పడతామంటూ అసహనం సైతం వ్యక్తం చేసిన పరిస్థితి. వీరికోసం కొన్ని స్వచ్చంద సంస్థలు సైతం పని చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరికి తీపికబురు వినిపించారు.
ప్రస్తుత సంవత్సరంలో లక్షల మంది వలసదారులకు మేలు చేసే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్నారు. అమెరికా పౌరులను పెళ్లి చేసుకుని కూడా చట్టబద్ధ హోదా లేకుండా అమెరికాలో నివసించాల్సి వస్తున్న వారికి శాశ్వత నివాస హక్కు, అమెరికా పౌరసత్వం అందించాలని నిర్ణయించారు. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లాడినవారికి పుట్టిన పిల్లల్లో 50,000 మందికి కూడా ఇదే వసతి లభిస్తుంది. అధ్యక్ష భవనం శ్వేతసౌధం మంగళవారం చేసిన ప్రకటనతో దాదాపు 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.
ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన పురుషులు లేదా మహిళలు అమెరికా పౌరులను పెళ్లాడిన తరవాత ఈ సోమవారం (జూన్ 17) నాటికి పదేళ్లుగా అమెరికాలో నివసించి ఉండాలి. సోమవారం దాటిన తరవాత పదేళ్లు నిండేవారికి ఈ సౌకర్యం లభించదు. అర్హులైనవారి దరఖాస్తు ఆమోదం పొందిన మూడేళ్లలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి తాత్కాలిక పని పర్మిట్ లభిస్తుంది. ఈ మూడేళ్లలో వారిని స్వదేశాలకు తిప్పిపంపరు. అమెరికా పౌరులను పెళ్లాడినా ఆ దేశ పౌరసత్వం లభించనివారు 11 లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో అర్హులైనవారికి పౌరసత్వం లభించనుంది. నవంబర్ లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఈ కీలకనిర్ణయం తీసుకున్నారు బైడన్.






