గాజా దాడులపై..
హమాస్ పై భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. భూతల, వైమానిక దాడులతో గాజా అతలాకుతలమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆ నగర ప్రజలకు మానవతా సాయం అందేలా చూడాలని ప్రపంచ నేతలు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. హమాస్ మిలిటెంట్లు, పౌరులకు మధ్య తేడాను గుర్తించడం ద్వారా గాజాలోని అమాయక ప్రజలను రక్షించాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు.
‘ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. పౌరుల ప్రాణాలను రక్షించే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఇజ్రాయెల్ వ్యవహరించాలి. హమాస్ మిలిటెంట్లు, పౌరులకు మధ్య తేడాను గుర్తించడం ద్వారా గాజాలోని పౌరుల్ని రక్షించాలి’ అని నెతన్యాహుకు బైడెన్ ఫోన్‌కాల్ ద్వారా సూచించారు. సామాన్య పౌరులు మిలిటరీ లక్ష్యాలు కాకూడదంటూ యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ మీడియాతో వ్యాఖ్యానించిన నేపథ్యంలో బైడెన్ స్పందన వచ్చింది.
బైడెన్.. ఈజిప్టు అధ్యక్షుడితో కూడా మాట్లాడినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇక ఇప్పటినుంచి గాజాకు అందుతోన్న మానవతా సాయాన్ని పెంచేందుకు ఇద్దరు నేతలు కట్టుబడి ఉన్నారని తెలిపింది. ఈ మానవతా సాయం ఎలాంటి అవాంతరాలు లేకుండా అందేలా చూడాలంటూ ప్రపంచ నేతలంతా పిలుపునిస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
మరోపక్క ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఇంటర్నెట్ సేవలు స్తంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడ కమ్యూనికేషన్‌ను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తునట్లు అమెరికా వెల్లడించింది. ఇదిలా ఉంటే.. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ వైపున 1,400 మంది మృతి చెందగా.. ప్రతీకార దాడుల్లో గాజాలో 8వేల మందికి పైగా మృతి చెందినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వం వెల్లడించింది. ఆ మృతుల్లో అత్యధికులు చిన్నారులేనని పేర్కొంది.
సిరియాలోని సైనిక ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ బయటపెట్టింది. సిరియా నుంచి ఇజ్రాయెల్ వైపుగా జరుగుతోన్న దాడులకు తాము స్పందించామని తెలిపింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రప్రాంతాలపై కూడా బాంబుల వర్షం కురిపించింది.













