తెరపైకి కొత్త ప్రధాని అభ్యర్థి..! విపక్షాలు ఓకే అంటాయా?
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది దేశ రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ఈసారి కూడా ఎలాగైనా తామే అధికారంలోకి వస్తామని బిజెపి నమ్ముతోంది. అయితే మోడీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ఈసారి కూడా మోదీని ఓడించకపోతే దేశంలో విపక్షాలకు మనుగడ ఉండదని పార్టీలు భయపడుతున్నాయి. అయితే మోడీ మెడలో గంట కట్టేది ఎవరు అనేదానిపై అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. విపక్షాలలో ఐక్యత లేకపోవడంతో మోదీని ఓడించడం కష్టంగా మారుతుంది. అయితే తాజాగా విపక్షాల ప్రధాన అభ్యర్థిగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. తండ్రి కరుణానిధి మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తమిళనాడులో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. జయలలిత లేని లోటును తనకు అనుకూలంగా మార్చుకోవడంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. అన్న డీఎంకేలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు స్టాలిన్ కు బాగా కలిసి వచ్చాయి. ఇప్పట్లో స్టాలిన్ ను కొట్టే మొనగాడు ఎవడు తమిళనాడులో లేరు. పళని స్వామి, పన్నీరు సెల్వం, శశికళ పార్టీ పగ్గాల కోసం తమలో తామే కొట్టుకు చస్తున్నారు. అక్కడ బిజెపి ఉన్నా లేనట్టే. కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ తోనే ఉంది. కమలహాసన్, విజయ్ కాంత్ లాంటి పార్టీలు పెద్దగా ప్రభావం చూపట్లేదు. ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్న పార్టీలు, నేతలతో స్టాలిన్ వ్యూహాత్మకంగా సఖ్యత కొనసాగిస్తున్నారు. దీంతో తమిళనాడులో స్టాలిన్ తిరుగులేని నేతగా ఎదిగారు.
ఇప్పుడు తమిళనాడు వదిలి దేశ రాజకీయాల వైపు స్టాలిన్ అడుగులేస్తున్నారని సంకేతాలు వస్తున్నాయి. తాజాగా స్టాలిన్ తన 70వ పుట్టినరోజును చెన్నైలో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్టాలిన్ బర్తడే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్ సంచలనం కలిగించాయి. బిజెపియేతర ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ ఎందుకు ఉండకూడదని మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ కు అన్ని అర్హతలు ఉన్నాయని అబ్దుల్లా చెప్పుకొచ్చారు. దీంతో స్టాలిన్ వచ్చే ఎన్నికల్లో దేశంపై ఫోకస్ పెట్టొచ్చని ఊహాగానాలు ఊపొందుకున్నాయి.
ప్రస్తుతం మోదీని దించాలని విపక్షాలన్నీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఎవరు అంటే సమాధానం లేదు. సతీష్ కుమార్, కేజ్రీవాల్, కెసిఆర్, మమతా బెనర్జీ ఎంతోమంది నేతలు ప్రధాని పీఠంపై కలలు కంటున్నారు. అయితే నితీష్ కుమార్ మినహా వీళ్ళెవరు కాంగ్రెస్ ను కలుపుకుపోయేందుకు సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో స్టాలిన్ అయితే అందరికీ ఆమోదయోగ్యుడు అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే స్టాలిన్ అందరివాడుగా గుర్తింపు పొందారు. బిజెపియేతర పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నారు. దేశంలో ప్రధాని పీఠంపై కూర్చోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా విపక్షాలకు సాధ్యం కాదు. కాబట్టి స్టాలిన్ కు కాంగ్రెస్ పార్టీ అండదండలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో బిజెపియేతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే స్టాలిన్ కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోపు ఏదైనా జరగొచ్చు.













