పుతిన్ – జెలెన్స్కీ..! యుద్ధంతో రాస్తున్న చరిత్ర..!!
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి సుమారు 8 నెలలవుతోంది. కానీ ఇప్పటికీ ఈ యుద్ధం ఓ కొలిక్కి రాలేదు. రెండు దేశాలూ వెనక్కు తగ్గకపోవడంతో భారీ నష్టం కలుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక యుక్రెయిన్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. క్రిమియా బ్రిడ్జిపై పేలుడు తర్వాత రష్యా దూకుడు మరింత పెంచింది. కీవ్ సహా యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో యుక్రెయిన్ ప్రజలు సబ్ వేలలో తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెలల తరబడి జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచదేశాల సాయం కోసం అభ్యర్థిస్తోంది. కానీ యుక్రెయిన్ – రష్యా మధ్య జోక్యం చేసుకునేందుకు ప్రపంచదేశాలేవీ నేరుగా ముందుకు రావట్లేదు. దీంతో ఈ యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
నాటోలో యుక్రెయిన్ చేరికను వ్యతిరేకిస్తూ యుద్దం మొదలు పెట్టింది రష్యా. అప్పుడు యుక్రెయిన్ కు అండగా నిలిచాయి నాటో దేశాలు. తమ శక్తిమేరా ఆయుధాలను సమకూర్చాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా సమరానికే కాలు దువ్వారు. దీంతో రష్యా రెచ్చిపోయింది. యుక్రెయిన్ పై తీవ్రంగా విరుచుకుపడింది. ప్రారంభంలో రష్యా దూకుడు చూసి నెల రోజుల్లోపే యుక్రెయిన్ .. రష్యా వశం కావడం ఖాయమని అందరూ భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది. యుక్రెయిన్ సైన్యం వ్యూహాల ముందు రష్యా తేలిపోయింది. అందుకే 8 నెలలవుతున్నా యుద్ధానికి ముగింపు లభించకపోగా.. మరింత ముందుకెళ్తోంది.
యుక్రెయిన్ లోని క్రిమియా ప్రాంతం చాలాకాలంగా రష్యా ఆధీనంలో ఉంది. రష్యాకు ఇదొక వ్యూహాత్మక స్థావరం. ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు రష్యా ఇక్కడికి రోడ్ కమ్ రైలు మార్గాలను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఇదే బ్రిడ్జిపై యుక్రెయిన్ పేలుడుకు పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పేలుడుకు పాల్పడింది తామేనని యుక్రెయిన్ ప్రకటించకపోయినా.. ఇది కచ్చితంగా యుక్రెయిన్ పనేనని రష్యా నమ్ముతోంది. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా యుక్రెయిన్ నే అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇన్నాళ్లూ కాస్త ఓపిక పట్టిన పుతిన్.. ఇప్పుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు.
ఆధిపత్యం కోసం అటు పుతిన్, ఇటు జెలెన్ స్కీ పోరాడుతున్నారు సరే.. మధ్యలో నలిగిపోతున్నదెవరు..? వీళ్లిద్దరూ రాజభవనాల్లో కూర్చుని ఆదేశాలిస్తున్నారు.. కానీ ప్రాణాలు పోతున్నది సైన్యానివి.. సామాన్య ప్రజలవి. తమ దేశ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఆయా దేశాధినేతలపైన ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది..? ప్రజలను సంతోషంగా ఉంచకుండా వీళ్లు చేసే యుద్ధం దేనికి? వాళ్ల పంతాలకు బలవుతున్నదెవరు..? దీనికి ముగింపు పలికేదెవరు? ఇప్పట్లో వీళ్లిద్దరూ వెనక్కు తగ్గేలా కనిపించట్లేదు. వీళ్లిద్దరి మధ్యలో జోక్యం చేసుకునేందుకూ ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో ఏం జరుగుతుందనేది తెలియట్లేదు. ఇలాగే యుద్ధం జరగుతూ పోతే రెండు దేశాలకూ నష్టమే. రష్యా ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. ఈ యుద్ధంతో అది మరింత దిగజారవచ్చు. ఇక యుక్రెయిన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడం ఖాయం. మరి వీళ్లద్దరి మెడలో గంటకట్టే వాళ్లెవరు..?













