స్పీకర్ ఎన్నిక..! ఎన్డీఏ, ఇండియా కూటమిల భవిష్యత్తుకు పరీక్ష..!!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినా సందడి మాత్రం ఇంకా తగ్గలేదు. మంత్రివర్గం ఏర్పాటు, ఎంపీల ప్రమాణ స్వీకారాలతో ఇప్పటికీ హడావుడి కనిపిస్తోంది. మోదీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గడం.. అదే సమయంలో కాంగ్రెస్ కూటమికి సీట్లు పెరగడంతో సమీకరణాలు మారాయి. ఇప్పుడు స్పీకర్ ఎన్నికకు సమయం దగ్గర పడడంతో ఈ సమీకరణాలు మరోసారి కీలకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంటుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర అంగీకారంతో స్పీకర్ ను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. దీంతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా సాగిపోయేది. అయితే ఈసారి మాత్రం స్పీకర్ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే తరపున ఓం బిర్లా మరోసారి స్పీకర్ బరిలో నిలిచారు. ఇక ఇండియా కూటమి తరపున కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ పోటీలో ఉన్నారు. దీంతో స్పీకర్ ఎన్నిక తప్పట్లేదు. అయితే అధికార కూటమి అభ్యర్థి ఓం బిర్లాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా ఎక్కడో ఏదో గుబులు రెండు కూటములను వెంటాడుతోంది.
రెండుసార్లు ఘనవిజయంతో పార్లమెంటులో అడుగుపెట్టిన బీజేపీ ఈసారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలోని పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే బొటాబొటీ మెజారిటీ ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదనుకుంటోంది బీజేపీ. అందుకే ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ ఎన్నికను సవాల్ గా తీసుకుంది. సభాసాంప్రదాయాలను బీజేపీ కాలరాస్తోందని.. అధికార పార్టీ అభ్యర్థి స్పీకర్ గా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వడం సాంప్రదాయమని చెప్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసినట్లు గుర్తు చేస్తోంది.
స్పీకర్ ఎన్నికలో ఎన్డీయే కూటమి ఓట్లు ఇండియా కూటమి అభ్యర్థికి పడినా.. ఇండియా కూటమి ఎంపీలు కొందరు ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపినా పరిణామాలు తీవ్రంగా ఉండడం ఖాయం. ఎన్డీయే కూటమి అభ్యర్థికి కాంగ్రెస్ మిత్రపక్షాల సభ్యులు మద్దతు తెలిపితే మున్ముందు ఆయా పార్టీలు తమ ఎంపీలను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే సమయంలో ఎన్డీయే కూటమి ఎంపీలు ఇండియా కూటమి వైపు వెళ్తే మాత్రం ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. బీజేపీకి దీన్ని ఎదుర్కోవడం కత్తిమీద సాము లాంటిదే. ఇండియా కూటమి సంఖ్యకు మించి ఒక్క ఓటు తమ అభ్యర్థికి వచ్చినా మోదీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడడం ఖాయం. స్టాక్ మార్కెట్లు విశ్వాసాన్ని కోల్పోతాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అందుకే ఈ ఎన్నికను రెండు పక్షాలూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.