కేసీఆర్, విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ వెంటనే లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అన్నిటికీ 9 నెలలు కూడా సమయం లేదు. దీంతో అన్ని పార్టీలూ సిద్ధమైపోయాయి. బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని విపక్షాలు ఈసారి గట్టిగా కూర్చుంటున్నాయి. ఉమ్మడిగా వెళ్లి ఆయన్ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐక్య కార్యాచరణ కోసం వరుస సమావేశాలు పెట్టి హడావుడి చేస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో లేదో చెప్పలేం. ఇంతలో విపక్షాలను విచ్చిన్నం చేసేందుకు, వాటి ప్రయత్నాలకు బ్రేక్ వేసేందుకు అధికార బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీయే విపక్షాల సమావేశంపై సెటైర్లు వేశారు.
ఇటీవల పట్నాలో విపక్షాల సమావేశం జరిగింది. కాంగ్రెస్ సహా 15 పార్టీలు ఈ మీటింగుకు హాజరయ్యాయి. బీజేపీని ఓడించేందుకు అవసరమైన కార్యాచరణకోసం వచ్చే నెలలో సిమ్లాలో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించాయి. మొత్తానికి మోదికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం సంచలనమే కలిగించింది. అయితే ఇవన్నీ ఎన్నికల వరకూ ఇలాగే కలిసి ఉంటాయా.. ఉండవా.. అనేది వేరే సంగతి. కానీ కాస్తోకూస్తో ముందడుగైతే వేశాయి. ఇందులో కొన్ని పార్టీలూ చివరి వరకూ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే ఈ విపక్షాలు ఇలాగే ముందుకెళ్తే మాత్రం బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే విపక్షాలు పట్నాలో సమావేశమయ్యాయి. అప్పుడు దీనిపై బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. మోదీ ఇండియా తిరిగి రావడంతో దీనిపై ఇవాళ స్పందించారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ మేరా బూత్ .. సబ్ సే మజ్ బూత్ అనే కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాల మీటింగుపై సెటైర్లు వేశారు. అవినీతిపై తాను చర్యలు తీసుకుంటుందే విపక్షాలన్నీ ఒక గూటికి చేరాయన్నారు. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలపై హామీ ఇస్తే.. నేను మాత్రం అవినీతిపరులకు శిక్ష పడేవరకూ నిద్రపోనని హామీ ఇస్తున్నా… అన్నారు మోదీ.
మరోవైపు కేసీఆర్ పైనా కూడా మోదీ స్పందించారు. కవిత బాగుండాలంటే కేసీఆర్ కు ఓటేయాలన్నారు. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటేయాలని సూచించారు. అంటే కేసీఆర్ గెలిస్తే అది ఆయన కుటుంబానికి మేలు జరుగుతుంది తప్ప ప్రజలకు మేలు జరగదని పరోక్షంగా చెప్పారు మోదీ. మరి మోదీ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.













