విపక్ష కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతుందా..?
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. అయితే మోదీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలని బీజేపీయేతర పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీలది ఇదే ఆలోచన. అయితే వీళ్లందరినీ గాటిన కట్టేసే బాధ్యతను జేడీయూ నేత నితీశ్ కుమార్ భుజానికెత్తుకున్నారు. ఈ నెల 23న పాట్నాలో విపక్ష నేతల సమావేశం జరగబోతోంది. బీజేపీని ఓడించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో సిద్ధం చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కొనసాగడం అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలాని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ గతంలోనే చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గాలని, అలాగే ఆ పార్టీ బలంగా ఉన్నచోట ప్రాంతీయ పార్టీలు పోటీ చేయకూడదనేది ఆమె సూచన. బీజేపీపై ఉమ్మడిగా ఒకే అభ్యర్థిని రంగంలోకి దింపాలనేది మమత కోరిక. అయితే ఇది ఆచరణ సాధ్యమా అనేది డౌటే. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, తమిళనాడులో డీఎంకే, పంజాబ్ లో అకాలీదళ్, ఢిల్లీలో ఆప్.. లాంటి పార్టీలు బలమైనవి. ఆయా రాష్ట్రాల్లో అవి మాత్రమే పోటీ చేయాలనుకుంటాయి. మరి కాంగ్రెస్ ఏమైపోవాలి?
అయినా ఈ కూటమి సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ సమ్మతించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ భేటీకి హాజరవుతున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ ను ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చేందుకు అవి ఒప్పుకోవు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే హాజరవడం వేస్ట్ అనేది కొందరి సూచన. పైగా నితీశ్ కుమార్, మమత బెనర్జీ ఎప్పుడు ఎవరితో ఉంటారో అంతుచిక్కదు. బీజేపీకి సన్నిహితంగా ఉంటారనే పేరుంది. అలాంటి వాళ్లను నమ్మలేం.
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఆ పార్టీకి ఓటేయాలనే నమ్మకం ఓటర్లకు కలుగుతోంది. ముఖ్యంగా ముస్లిం, దళిత వర్గాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడనున్నాయి. ఈ విషయం గ్రహించిన మమత బెనర్జీ, నితీశ్ కుమార్ కాంగ్రెస్ ను తమతో కలుపుకోవాలనుకుంటున్నారు. లేకుంటే ఈసారి ముస్లిం, దళితవర్గాలు తమకు దూరమవడం ఖాయం. ఆ ఓట్లు కాంగ్రెస్ కు పడితే తమ ఓటమి ఖాయం. అందుకే కాంగ్రెస్ పై అంత ప్రేమ ఒలకబోస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి కొందరు నమ్మకమైన మిత్రులున్నారు. స్టాలిన్, అకాలీదళ్, శివసేన, శరద్ పవార్.. లాంటి వాళ్లు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. పైగా కమ్యూనిస్టులు ఎప్పటికీ హస్తం పార్టీతోనే ఉంటారు. పైగా ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. దాదాపు 300 స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్ ఉంటుంది. మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి. అక్కడ మాత్రం వారితో పొత్తుపెట్టుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే విపక్ష కూటమిపై కాంగ్రెస్ పార్టీ అంత నమ్మకంగా కనిపించట్లేదు. ఈ కూటమిలో ఉంటే తమకు కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువనేది కాంగ్రెస్ నేతల అంచనా.













