కర్నాటకలో బీజేపీకి అమూల్ దెబ్బ!
కర్నాటక ఎన్నికలు మరో నెలలో జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ ప్రత్యర్థులపై అస్త్రాలు సంధిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకవైపు పార్టీ నేతల్లో చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అభ్యర్థులను ప్రకటించకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే.. క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తే ఇంకెలా ఉంటుందో అని బీజేపీ హైకమాండ్ ఆందోళన చెందుతోంది. దీనికి తోడు అమూల్ వివాదం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది.
అమూల్ పేరొందిన పాల ఉత్పత్తుల బ్రాండ్. దశాబ్దాలుగా దేశంలో ఎంతో పేరొందింది. గుజరాత్ కేంద్రంగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నిన్నమొన్నటి వరకూ ఇది ఉత్తరాదికే పరిమితమైంది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇది దాదాపు దేశమంతా విస్తరించేందుకు స్కెచ్ వేసింది. అందులో భాగంగా ఏపీ, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో ఉత్పత్తులను మొదలుపెట్టింది. అటు కేంద్రంలో, ఇటు కర్నాటకలో బీజేపీనే అధికారంలో ఉండడంతో అమూల్ ఎంట్రీకి పెద్దగా సమస్య ఎదురుకాలేదు.
కర్నాటకలో నందిని బ్రాండ్ చాలా పాపులర్. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ దీని మాతృ సంస్థ. దశాబ్దాలుగా ఇది రైతుల నుంచి పాలు సేకరించి తక్కువ ధరకే నాణ్యమైన పాలు అందిస్తోంది. ఇది కన్నడిగుల ఆదరాభిమానాలు చూరగొంది. అయితే నంది ఉండగా అమూల్ మనుగడ కష్టమని భావించిన బీజేపీ పెద్దలు.. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ తో కలిసి అమూల్ పనిచేసేందుకు ఒప్పందం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే దీన్ని కర్నాటక ప్రజలు, రైతులు, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గుజరాతీ కంపెనీ అమూల్.. నందిని బ్రాండ్ ను మింగేయడం ఖాయమని హెచ్చరించారు. ఈ ఒప్పందానికి ససేమిరా అన్నారు. ఎన్నికల సమయంలో ఇప్పుడు ఇది అజెండాగా మారింది.
కర్నాటక మిల్క్ ఫెడరేషన్ తో అమూల్ ఒప్పందం ఉండదని ఇప్పుడు బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఎన్నికల సమయం కాబట్టి వాళ్లు అలా చెప్తున్నారని.. రేపు అధికారంలోకి వస్తే మళ్లీ ఒప్పందం చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిక బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. అసలే అంతర్గత విభేదాలు, నేతల కప్పదాట్లతో సతమతమవుతున్న బీజేపీకి అమూల్ భారీ నష్టం కలగిస్తోంది.













