USA: భారత్, అమెరికా మధ్య స్ట్రాంగ్ డిఫెన్స్ పాలసీ.. ట్రంప్ సంతకం..!
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో జరుగుతోన్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. భారత్ (Deeper Engagement With India)తో సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. క్వాడ్ కూటమి (Quad) ద్వారా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ సంతకం (Trump signs into law defence policy bill) చేశారు.
దేశీయ, విదేశీ బెదిరింపుల నుంచి మాతృభూమిని రక్షించడానికి, రక్షణ పారిశ్రామికరంగ పునాదులను బలోపేతం చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినప్పుడే ఇండో-పసిఫిక్లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని వెల్లడించారు.
ప్రస్తుతం ట్రంప్ సంతకం చేసిన ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ -2026లో భారత్తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, క్వాడ్ ద్వారా స్వేచ్ఛాయుతమైన, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడం, చైనాతో వ్యూహాత్మక పోటీలో అమెరికా ప్రయోజనాలను పెంచడం వంటివి ఉన్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఇరుదేశాలు సంయుక్త సైనిక విన్యాసాలలో పాల్గొనడం, రక్షణ వాణిజ్యం, విపత్తు సమయాల్లో మానవతా సాయం, సముద్ర భద్రత విషయంలో సహకారం వంటి ప్రయోజనాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.






