అధ్యక్ష ఎన్నికల్లో ‘ట్రంప్’ కార్డ్…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ట్రంప్ గాలి వీయనుందా? ప్రస్తుత పరిణామాలు, జనాదరణ చూస్తే అదే అనిపిస్తోంది. రిపబ్లిక్ పార్టీ తరపున నామినేషన్ కు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ట్రంప్.. ఎవరికీ అందనంత ఎత్తున ఉన్నారు. భారతీయ అమెరికన్ నేత నిక్కీ హేలీ సొంతరాష్ట్రమైన దక్షిణ కరోలినాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు! సీఎన్ఎన్ తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారిలో 53% మంది తాము ట్రంప్‌నకు బాసటగా నిలుస్తామని చెప్పారు. 22% మంది మాత్రం హేలీకి మద్దతు ప్రకటించారు. మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ఒక్కశాతం మందే మద్దతుగా నిలిచారు.
ప్రైమరీల ఎన్నికలు ముందుగా జరిగే రాష్ట్రాల్లో దక్షిణ కరోలినా కూడా ఉంది. ప్రస్తుత మద్దతుదారులతో మాట్లాడినప్పుడు తాము తిరిగి ట్రంప్‌నకే మద్దతు ఇస్తామని 82% మంది చెప్పారు. హేలీ విషయంలో 42% మంది, డిశాంటిస్‌కు 38% మంది ఈ రీతిలో స్పందించారు. అమెరికా మొత్తంమీద ఎవరికి ఎంత మద్దతు ఉందనే విషయంలో ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ అంచనాలు వేసింది. రిపబ్లికన్లలో 59% మంది ట్రంప్ పక్షాన ఉంటారని దానిలో తేలింది. డిశాంటిస్ (12.6%), హేలీ (8.3%), రామస్వామి (4.6) ఆ తర్వాత స్థానాల్లో ఉంటారని తెలిపింది.
కాలేజీ డిగ్రీలేని ఓటర్లలో హేలీ కన్నా ట్రంప్ 50శాతం పాయింట్లు, రిపబ్లికన్లలో 40 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.తమను తాము ‘చాలా కన్జర్వేటివ్’గా అభివర్ణించుకునేవారు (66%), ఏటా 50,000 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్న కుటుంబాల్లోని వారు (69%) మాజీ అధ్యక్షుడికి మద్ధతుగా నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా.. దక్షిణ కరోలినాలోని జిఓపి ప్రైమరీ ఓటర్లలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్న వైట్ ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువగా ట్రంప్ కు మద్దతు ఇస్తున్నారు, హేలీ (18%) మరియు డిశాంటిస్ (16%) ఇద్దరూ బాగా వెనుకబడి ఉన్నారు.
2020 ఎన్నికల్లో తన ఓటమిని తిప్పికొట్టేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాల నేపథ్యంలో కొనసాగుతున్న క్రిమినల్ కేసులపై చాలా తక్కువ మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కరోలినా జిఓపి ప్రాథమిక ఓటర్లలో సగానికి పైగా అంటే… 53% మంది ఆర్థిక వ్యవస్థను తమ ప్రధాన సమస్యగా పేర్కొన్నారు, 21% మంది వలసలు, 8% ఓటు హక్కులు, ఎన్నికల సమగ్రత, 5% గర్భస్రావం, 5% విదేశాంగ విధానం మరియు 2% ఇంధన విధానాన్ని ఎంచుకున్నారు.






