చంద్రబాబే మళ్ళీ సిఎం కావాలి – జయరాం కోమటి
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ గెలవడం ముఖ్యమని ఎన్నారై టీడిపి అధినేత, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు రాష్ట్రానికి విజన్ ఉన్న మంచినాయకుడు అవసరం ఉందని, చంద్రబాబుకు ఉన్న విజన్‌తో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన జయరామ్ కోమటి ‘తెలుగుటైమ్స్’ పలుకరించినప్పుడు ఆయన పలు విషయాలను చెప్పారు.
చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు విభజన కష్టాలు తొలగిపోలేదు. రాజధాని ఇంకా రూపుదిద్దుకోలేదు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని మనం కోల్పోయాము. మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోంది. పారిశ్రామిక రాయితీలు ఇవ్వమని చెప్పేసింది. ప్రత్యేక రైల్వేజోన్ ఖర్చు తప్ప ఆదాయం లేని విధంగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు అన్నీచోట్లా అన్యాయమే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి నడిపించడానికి, కేంద్రంతో గట్టిగా పోరాడి రాష్ట్రానికి రావాల్సింది సాధించుకోవడానికి బలమైన నేత అవసరం. అదేసమయంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దూరదృష్టి ఉన్న దార్శనిక నేత ఉండాలి. అందుకే చంద్రబాబు నాయుడును మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను.
రాష్ట్ర అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయా?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. 972 కి.మీ తీరప్రాంతం ఉంది. టెక్నాలజీ, నాలెడ్జ్, రవాణా హబ్‌గా అభివృద్ధికి ఇక్కడ సానుకూల అంశాలు ఎన్నో ఉన్నాయి. దానికితోడు ఎపి ప్రజలు అన్నీరంగాల్లోనూ దూసుకుపోయే సత్తా ఉన్నవాళ్ళు. ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్న రాష్ట్రాన్ని అన్నీరంగాల్లో అభివృద్ధి చేసి, ఆర్థికంగా సుసంపన్నం చేసే విజన్ ఉన్న నాయకులు ఇప్పుడు ఎంతో అవసరం.
ఎన్నారైలు ఏమనుకుంటున్నారు?
అమెరికాలో ఎంతోమంది తెలుగువారు ఉన్నతరంగంలో ఉన్నారు. వారిలో చాలామంది తాము ఇక్కడకు రావడానికి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ప్రవేశపెట్టిన సంస్కరణలే తమకు ఉపాధిని కల్పించాయని నమ్ముతారు. చంద్రబాబులాంటి నాయకుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటేనే పెట్టుబడులు కూడా వస్తాయని భావిస్తారు. ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేముందు ఇక్కడ ఉన్న భద్రత, వనరులు, మౌలిక సదుపాయాలతోపాటు రాష్ట్రానికి విజన్ ఉన్న నాయకుడే అధికారంలో ఉన్నాడా లేదా అని చూస్తారు. గత ఐదేళ్ళలో రాష్ట్రానికి అమెరికా నుంచి ఐటీ కంపెనీలు వచ్చిందంటే అందుకు చంద్రబాబే కారణం. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మీ అభిప్రాయం?
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో పెట్టుబడులు పెట్టిన కొంతమంది పారిశ్రామికవేత్తలు జైలుకెళ్ళారు. దానికితోడు అప్పుట్లో ఉన్నత అధికారులుగా ఉన్న కొందరు కూడా వైఎస్‌కు అనుకూలంగా చేసిన పనుల వల్ల జైలుకు పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్‌పై కూడా అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఆ పార్టీ అధికారంలోకి వస్తే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా లేదా అన్నది ఆలోచించి చూడాల్సింది.
ఎన్నారైల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసింది?
గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నారైల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నారైలను కూడా భాగస్వాములుగా చేశారు. ఎపి జన్మభూమి, ఎపిఎన్ఆర్టీ వంటి సంస్థల ఏర్పాటు ద్వారా ఎన్నారైలను రాష్ట్రానికి ఆయన తీసుకువచ్చారు. ఎన్నారైల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలను ఆయన అమలు చేశారు. అమరావతిలో ఎపిఎన్ఆర్టీ భవన్ ఏర్పాటు చేశారు. ఎపి జన్మభూమి ప్రతినిధిగా నేను ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతులను ఎన్నారైల సహకారంతో ఏర్పాటు చేయించా. అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశా. శ్మశానవాటికలను అభివృద్ధి చేశా. ఇలా ఎన్నో అభివృద్ధిపనులను ఎన్నారైల సహకారంతో రాష్ట్రంలో నిర్వహించా. ఇదంతా ముఖ్యమంత్రి అందించిన సహకారం వల్లనే సాధ్యమైంది. ఇలాగే మరిన్ని అభివృద్ధిపనులు చేయాలంటే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నాతోపాటు చాలామంది ఎన్నారైలు కోరుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు ఏ విధంగా పాల్గొంటున్నారు?
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నారై టీడిపి ఆధ్వర్యంలో ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ప్రత్యక్షంగా ఓటర్లను కలుసుకుంటూ, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, ప్రజల కోసం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. మరోవైపు కొంతమంది సెలవుల్లేక అమెరికా నుంచే సామాజికమాధ్యమ వేదికగా ఓటర్లను చైతన్యపరుస్తూ, టీడిపి గెలవాల్సిన అవశ్యకతను వివరిస్తున్నారు.
ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది?
నేను ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత అమెరికా నుంచి రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారంలోకి దిగాను. నేను చాలాచోట్ల ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళినపుడు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. మరోవైపు ఎన్నారై టీడిపి వర్గాలు పలువురి నుంచి సేకరించిన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీకి అధికారం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏదీ ఏమైనా రాష్ట్రానికి మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలని, ఈ ఎన్నికల్లో టీడిపిని అన్నీచోట్లా గెలిపించాలని ఎన్నారై టీడిపి తరపున కోరుకుంటున్నాను.













