భాగ్యనగరానికి ఇవాంక శోభ
అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు భాగ్యనగరంలో కనువిందు చేయబోతున్నారు. వందలాది మంది అతిథులతోపాటు, అధికార, అనధికార ముఖ్య అతిథులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ గ్లోబల్ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేడుకను ప్రారంభించేందుకు తరలివస్తున్నారు. ముఖ్యనేతలు, యువ పారిశ్రామికవేత్తలు, వందలాది మంది ప్రపంచ అతిరథులతో అలరించే ఈ వేడుకలో ఇవాంక, మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. వేడుక ప్రారంభం నుంచి ఫలక్నుమా ప్యాలెస్ విందు దాకా జరిగే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో వీళ్లద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారనడం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇవాంక, మోడీ వస్రాధారణ ఎలా ఉండబోతున్నదనే దానిపై ఆసక్తి నెలకొంది.













