ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం యోగి

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. యూపీలో నాయకత్వాన్ని మార్చబోతున్నారన్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సీఎం యోగి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన విషయం విదితమే. ‘‘ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ కావడాన్ని సంతోషంగా భావిస్తున్నాను. ఆయన మార్గదర్శకత్వాన్ని తీసుకున్నాను. అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ నాకు సమయం ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు’’ అంటూ యోగి ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయన్నది ఇదమిత్ధంగా తెలియరాలేదు. యూపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు, కోవిడ్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న చర్యల గురించి వీరిద్దరి మధ్య ప్రస్తావన వచ్చినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.