నేను జైలు నుంచి పోటీ చేస్తే… 70 సీట్లు మావే

రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలనూ గెలుచుకుంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్బంధించి ఎన్నికలు జరపండని కేజ్రీవాల్ కేంద్రానికి సవాల్ విసిరారు. ప్రజలు అమాయకులని కాషాయ పాలకులు భావిస్తున్నారని అన్నారు. బీజేపీకి ఢిల్లీ ప్రజలే దీటుగా బదులిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జైలుపాలైనా సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించగా, తాను రాజీనామా చేస్తే తదుపరి బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో పినరాయి విజయన్, తమళనాడులో ఎంకే స్టాలిన్ ఇలా విపక్ష సీఎంలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని బదులిచ్చారు. విపక్ష నేతలను అరెస్ట్ చేసి ఆయా ప్రభుత్వాలను కూల్చాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. తనకు పదవీ కాంక్ష లేదని, అయితే తాను రాజీనామా చేస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మురికివాడల్లో పనిచేసేందుకు తాను ఆదాయ పన్ను శాఖ కమిషనర్ పదవికీ రాజీనామా చేశానని గుర్తు చేశారు. అయితే ఇదంతా తమ పోరాటంలో భాగమని, ఈసారి తాను సీఎం పదవి నుంచి వైదొలగబోనని స్పష్టం చేశారు.