అన్నాడీఎంకే కూటమికి విజయకాంత్ గుడ్ బై
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నటుడు విజయ్కాంత్కి చెందిన డీఎండీకే పార్టీ అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని వీడింది. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై విభేదాల కారణంగా కూటమి నుంచి ఆ పార్టీ వైదొలిగింది. దీనిపై విజయ్ కాంత్ పార్టీ ప్రకటన చేసింది. మూడు రౌండ్ల చర్చల తరవాత కూడా సీట్ల పంపకంపై సయోధ్య కుదరకపోవడంతో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు డీఎండీకే తెలిపింది. కూటమిలో తమకు తగిన ప్రాధాన్యం లభించకపోతే మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గత కొద్దివారాలుగా ఆ పార్టీ సూచన ప్రాయంగా వెల్లడిస్తూనే ఉంది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. తాజా ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ తన తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకు ఏప్రిల్ ఆరునే పోలింగ్ జరగనుంది. మే రెండున పార్టీల భవితవ్వం వెల్లడికానుంది.













