భారత్ పర్యటనలో అమెరికా విదేశాంగ కార్యదర్శి
2+2 సంభాషణల నిమిత్తం అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ న్యూఢిల్లీ చేరుకున్నారు. మైక్ పాంపియో వెంట ఆయన భార్య సుసాన్ కూడా ఉన్నారు. వీరికి న్యూఢిల్లీలో దౌత్య అధికారులు ఘన స్వాగతం పలికారు. చర్చలు మంగళవారం జరుగనున్నాయి. రెండు రోజుల పర్యటన సందర్భంగా వీరు కేంద్ర మంత్రి జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి.. ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల ముందుగా వీరి పర్యటన జరుగడం ప్రాధాన్యతనిస్తున్నది. మైక్ పాంపియో, మార్క్ ఎస్పెర్ తమ పర్యటనలో శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియాలను కూడా సందర్శించనున్నారు.













