కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం… రెండు వారాల పాటు
కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కేబినెట్ భేటీ నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యవసర సర్వీసులకు మాత్రం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోందన్నారు. ఢిల్లీ, మహారాష్ట్రల కన్నా మన దగ్గర పరిస్థితి భయంకరంగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం. 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్రం ఎలాను ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉంటూ జాగ్రత్తలు పాటించాలి అని కోరారు. 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ రెండు వారాల పాటు ప్రజా రవాణా సైతం నిలిచిపోనుంది. వస్త్ర రంగంతో పాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలపై ఎలాంటి నిషేదాజ్ఞలు ఉండవని స్పష్టం చేశారు.













