ఏపీకి రూ.493 కోట్లు .. తెలంగాణకు రూ.188 కోట్లు!
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంది. వరదల కారణంగా పలు రాష్ట్రాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విపత్తుల ప్రతిస్పందన నిర్వహణ నిధులను (ఎస్డీఆర్ఎఫ్) విడుదల చేసింది. 22 రాష్ట్రాల్లోని రాష్ట్ర విపత్తు స్పందన నిధి కోసం మొత్తంగా రూ.7532 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.493.60 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ.188.80 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఎస్డీఆర్ నిధులు విడుదల చేసినట్లు ఆర్థికశాఖలోని వ్యయ విభాగం వెల్లడిరచింది. అయితే, దేశవ్యాప్తంగా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని వీటిలో నిబంధనలను సడలించినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సర నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణపత్రాల కోసం వేచిచూడకుండానే ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.













