ధర్మం Vs న్యాయం : ఏది గొప్ప !
(హిందూ పురాణాల్లోని మూడు సంఘటనలతో వివరణ)
ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా ఏదో ఒక సమయంలో ధర్మం – న్యాయం నడుమ సున్నితమైన విభజన రేఖ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. తమిళనాడులో ఓ రాజకీయనాయకుడు (ఉదయనిథి స్టాలిన్) చేసిన వాఖ్యలతో మరోమారు ఈ సూక్ష్మమైన అంశం గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
పైపైన వీక్షించినప్పుడు ధర్మం, న్యాయం ఇంచుమించు ఒకేలా అనిపిస్తాయి. ఒక పాత్రలోని పాలునీళ్లు లాగా కలిసినట్టే కనిపిస్తాయి. రెండూ సమాజ సుస్థిరతకు తోడ్పడేవే. ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం రెండు ఉన్నతమైనవే. కానీ ఒక్కోసారి ఈ రెంటిలో ఏది మిన్న అన్న మీమాంశ తలెత్తుతూనే ఉంది.
ధర్మం – న్యాయం; వాటి స్వరూపం
ధర్మం సుస్థిరమైనది, సూర్యకాంతి వంటిది. ఇక, న్యాయమన్నది చంచలమైనది. మిణుగురు పురుగల కాంతి వంటిది. శాశ్వత రూపం లేనిది. న్యాయం కాలానుగుణంగా, అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి మారుతుంటంది. అందుకే న్యాయబద్ధంగా నడిచేవానికంటే ధర్మబద్ధంగా జీవించేవ్యక్తిని అన్ని కాలాలలోనూ సర్వోన్నతుడిగానే పరిగణించాలి. న్యాయం కంటే ధర్మం మహోన్నతమైనది. కాలానుగుణంగా మారే న్యాయమే గొప్పగా భావిస్తూ సనాతన ధర్మాన్ని కించపరచడం అల్పత్వానికి నిదర్శనం.
ధర్మానికి న్యాయానికి నడుమ సూక్ష్మమైన తేడా ఉంది. అది గ్రహించి తదనుగుణంగా నడుచుకునేవాడు ధన్యజీవి. ఈ తేడా తెలియజెప్పడం కోసం మన హిందూ పురాణ, ఇతిహాసాల నుంచి కొన్ని ఉదాహరణలు ప్రస్తావిస్తాను. మన పురాణ ఇతిహాసాలన్నీ ధర్మశాస్త్రాలే. తరచి చూస్తే అనేకానేక సంఘటనలు ధర్మం – న్యాయ మధ్య తలెత్తే మీమాంశను తొలగించుకోవడానికి సహాయపడతాయి.
అమృతం పంపకం – విష్ణువు ఎంచుకున్న మార్గం
క్షీరసాగర మధనం – ఇది మనందరికీ తెలిసిన కథే. క్షీరసాగర మధనం చేయడానికి ముందే దేవతలకు, రాక్షసులకు నడుమ ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం క్షీరసాగర మధనం వల్ల లభించే సంపద (అమృతం సహా) ఇరు వర్గాలవారు చెరిసగం పంచుకోవాల్సి ఉంటుంది. కానీ అలా జరిగిందా? లేదే. ముఖ్యంగా అమృతం రాక్షసులకు దక్కకుండా విష్ణువు మోహినీ అవతారందాల్చి మాయోపాయంతో అమృతమంతా దేవతలకే అందేలా చూశాడు కదా. ఇది న్యాయసమ్మతమేనా? అని ప్రశ్నించుకుంటే, కాదనే చెప్పాలి. అలాగే, ధర్మసమ్మతమేనా? అని యోచిస్తే అవుననే చెప్పుకోవాలి.
ధర్మానికి, న్యాయానికీ నడుమ ఈ తేడా ఎందుకొచ్చింది? ఇరువర్గాల వారు సమంగా కష్టపడినప్పుడు, పైగా ముందుగా ఒప్పందం చేసుకున్నప్పుడు సమంగా పంచడమే న్యాయం కదా. ఈ వ్యవహారాన్ని పైపైన చూసినప్పుడు విష్ణువు చేసింది అన్యాయమనే అనిపిస్తుంది. కానీ ఆయన నడిచింది ధర్మ మార్గమే.
హరిశ్చంద్రుడు – ధర్మం మార్గం
రెండవ ఉదాహరణగా హరిశ్చంద్రోపాఖ్యానం తీసుకుందాము. హరిశ్చంద్రుడు సత్యశీలుడు. అసత్యం పలకలేక తాను కష్టపడుతూ, చివరకు ఆలుబిడ్డలను సైతం అష్టకష్టాలు పెట్టాడు. ఒక దశలో భార్య తల నరకబోయాడు. ఈ సంఘటనను రెండు రకాలుగా భావించవచ్చు. తన జీవితం చివరి వరకు ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటానన్న పెళ్లినాటి ప్రమాణాన్ని పక్కనపెట్టి భార్యను చంపబోవడం అన్యాయం, అక్రమం. ఇక రెండవ కోణంలో ఆలోచిస్తే ఈ చర్య ధర్మ బద్ధం. సత్యమేవ జయతే అన్నసూక్తికి మూలబిందువైనది. ఈ తేడాను గ్రహించినవాడు హరిశ్చంద్రుడు.
ఇంటి గుట్టు చెప్పిన విభీషణుడు
మూడవ ఉదాహరణగా రామాయణంలోని రావణవధ ఘట్టాన్ని తీసుకుందాము. అధర్మ మార్గాన నడిచిన రావణుడి వధకు అనేక కారణాలున్నప్పటికీ విభీషణుడి పాత్రను మరచిపోలేము. రావణుడి మరణానికి దారితీసే కీలక రహస్యం రాముడి చెవిన వేసినవాడు విభీషణుడు. ఇతగాడు రావణాసురునికి తమ్ముడే. యుద్ధ సమయంలో రావణుడు ఎంతకీ నేలకొరగకుండా పోరాడుతున్నప్పుడు రావణుడి మరణం అతగాడి నాభికి బాణం తగిలితేనేగాని సంభవించదన్న రహస్యాన్ని రాముడి చెవిన వేసినవాడు విభీషణుడు. ఇందుకు ప్రతిగా, ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తీసుకువచ్చాడన్న అపవాదుని విభీషణుడు భరించాడు. అయినా అతగాడు ఆ నాటి సామాజిక న్యాయానికి విరుద్ధంగా ధర్మ మార్గాన్నే ఎంచుకున్నాడు. అందుకే రాముడికి స్నేహ హస్తం చాచాడు.
ధర్మం సర్వోన్నతం
ఇంకా అనేక సంఘటనలు మన పురాణ, ఇతిహాసాల్లో కనిపిస్తాయి. నిజానికి ఆనాటి కాలంలోనే కాదు, ఈనాడు కూడా ఇలాంటి సంకట స్థితులు తలెత్తుతూనే ఉంటాయి. ధర్మం గొప్పదా, న్యాయం గొప్పదా అన్న సంకట స్థితి తలెత్తుతూనే ఉంటుంది. ఈ రెంటి నడుమ ఉన్న సున్నిత విభజన రేఖను గుర్తించాలి. అలా చేయగలిగితేనే సమాజం సుస్థిరమవుతుంది. ధర్మమార్గాన సమాజం ఫరిడవిల్లుతుంది.
అమృతాన్ని పంచడంలో విష్ణువు ధర్మమార్గం అనుసరించాడు. దేవతలు, రాక్షసుల నడుమ ఉన్న వారి మానసిక స్థితులు, స్వభావాలరీత్యా వారు చేస్తున్న పనుల్లోని తేడాల కారణంగా అసురలకు న్యాయం రావాల్సిన అమృతాన్ని దక్కకుండా దేవతల పరం చేశాడు. ఒక వేళ న్యాయానికే పెద్దపీట వేసి ఉంటే, రాక్షసులకు సమ వాటా ఇచ్చి ఉంటే, అప్పుడేమయ్యేది? చెడు రాజ్యమేలేది. మహావినాశనం చోటుచేసుకునేది. అందుకే న్యాయమైన పంపకాన్ని పక్కనబెట్టి ధర్మపరంగా అమృతాన్ని పంపకం చేసి విష్ణువు ధర్మసంస్థాపన గావించారు.
ఇక, హరిశ్చంద్రుడు సంకట స్థితిలో కూడా న్యాయం కంటే ధర్మ మార్గం గొప్పదని తలచే కట్టుకున్న భార్యని నరకబోయాడు.
విభీషణుడు కూడా అంతే, న్యాయపరంగా తాను లంకాదేశ చక్రవర్తి అయిన రావణుడి ఆజ్ఞలే పాటించాలి. పైగా సోదరుడు కూడా అయిన రావణుడికి ఏ రకంగానూ హాని తలపెట్టకూడదు. కానీ ఈ న్యాయ సూత్రాన్ని పక్కనబెట్టి ధర్మమార్గాన నడిచాడు. లంకాదీశుడి కంటే లంకా ద్వీపం, అందులోని ప్రజల క్షేమం ముఖ్యమని గ్రహించాడు. అందుకే ఇంటి గుట్టు చెప్పేశాడు. నాటి సామాజిక న్యాయ మార్గం కంటే ధర్మపథం వైపే మొగ్గుచూపాడు. అలాగే రామాయణంలోనే అంతకు ముందు రాముడు చెట్టుచాటునుంచి వాలిని వధించాడు. అక్కడ కూడా రాముడు న్యాయం కంటే ధర్మం గొప్పదని తలచే ఆపని చేశాడు.
శ్రీకృష్ణుడు కూడా ధర్మసంస్థాపనకే పెద్దపీట వేశాడు. ఇందు కోసం అనేకమార్లు కృష్ణుడు విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.
ఏది న్యాయం, ఏది ధర్మం అన్న మీమాంశ తలెత్తినప్పుడు ఎటు పోవాలన్న సందిగ్ధత కలగడమన్నది ఇప్పుడు కొత్తేమీకాదు, గతంలో ఎన్నో మార్లు ఇలాంటి సంకట స్థితులు తలెత్తాయి. ఐతే, చివరకు న్యాయ మార్గం కంటే, ధర్మ మార్గమే సరైనదని రుజువైనది.
అలా అని సామాజిక న్యాయాన్ని తప్పుబట్టడంలేదు. కాకపోతే న్యాయం – ధర్మం మధ్య సంకట స్థితి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం కోసమే ఈ వివరాలు అందజేశాను.
ముగింపు:
మళ్లీ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దగ్గరికే వెళదాం. ఈ యువ నాయకుడు సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదు, పూర్తిగా తొలగించాలన్నారు.
ఇక్కడ రెండు ప్రశ్నలు.. అయనగారికి సనాతన ధర్మం లోతులు తెలుసా ? ధర్మం పై విరుచుకుపడే ఇతగానికి ధర్మసూక్ష్మాల గరించిగానీ, ధర్మానికీ న్యాయానికీ మధ్య ఉన్న సున్నిత రేఖ గురించి తెలుసా?
సనాతన ధర్మాన్ని కూకటి వేర్లతో పెకిలించాలన్న ఇతగాడి విపరీత ధోరణి సహజంగానే పెద్ద దుమారమే రేపుతున్నది. చివరికది హింసాత్మక వ్యాఖ్యల స్థాయికి చేరింది. హింసాత్మక పోకడ ఎవరికీ ఎప్పటికీ మంచిది కాదు. ఉన్మాద వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. అందుకే ధర్మం – న్యాయం మధ్య ఉన్న సున్నిత తేడాను అంతా గుర్తించేలా విజ్ఞులు ప్రచారం చేయాలేగాని, రెచ్చగొట్టే మాటల వల్ల ప్రయోజనం ఉండదు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మ సూక్ష్మాలను విశదపరచే పని వేగవంతం కావాలి. మీరేమంటారు ?
తుర్లపాటి నాగ భూషణ రావు, సీనియర్ జర్నలిస్ట్
Basingstoke, UK
nrturlapati@gmail.com













