యడియూరప్ప ఇక ఇంటికే? సాహసోపేత నిర్ణయం తీసుకోనున్న బీజేపీ?
బీజేపీ అధిష్ఠానం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోనుంది. కులం, సీనియారిటీ, మతం ఈ మూడింటిని మిళితం చేసి కర్నాటక రాజకీయాలను చెడుగుడు ఆడుకుంటున్న ముఖ్యమంత్రి యడియూరప్పను తప్పించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఏకుకు మేకై కూర్చుండిపోయిన యడియూరప్పను తప్పించడానికి అధిష్ఠానం అష్టకష్టాలూ పడుతోంది. కానీ… రాజకీయాలను ప్రభావితం చేసే లింగాయత్ వర్గానికి చెందిన నేతగా చెలామణి అవుతున్న ఆయన్ను ఎలా తప్పించాలో అధిష్ఠానానికి పాలుపోవడం లేదు. తాజాగా… కోర్టు తీర్పును మిషగా పెట్టి… ఆయన్ను తప్పించాలని డిసైడ్ అయ్యారు. ఐటీ పార్కుల కోసం కేటాయించిన భూమిని గృహ నిర్మాణం అవసరాలకు మళ్లిడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని, దానిపై దర్యాప్తు చేయాలంటూ 2013 లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని యడియూరప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టేసింది. దీంతో యడియూరప్పకు కష్టకాలం ప్రారంభమైంది. కర్నాటక రాష్ట్రంలో లోకాయుక్త చాలా నిష్కర్షగా పనిచేస్తుందన్న పేరుంది. అంతేకాకుండా లోకాయుక్త ఈ కేసును చాలా పకడ్బందీగా దర్యాప్తు చేయాలని కూడా హైకోర్టు సూచించింది.
ఈ నేపథ్యంలోనే యడియూరప్ప కూడా దిగిపోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే కాస్త గడువు ఇవ్వాలని ఆయన అధిష్ఠానానికి విన్నవించుకున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త మొహంతో ముందుకు యడియూరప్పకు 75 ఏళ్లు నిండాయి. 75 ఏళ్లు నిండిన తర్వాత ఏ నాయకుడ్నీ క్రియాశీలక పదవుల్లో ఉంచకూడదని బీజేపీ పెద్దలు ఓ తీర్మానం కూడా చేసుకున్నారు. హైకోర్టు తీర్పు, వయస్సు.. ఈ రెండింటినీ చూయించి యడియూరప్పను తొలగించనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త నాయకుడ్ని ముందు పెట్టి ఎన్నికల గోదాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత ఆరు నెలలుగా బీజేపీ పెద్దలు ఇదే పనిమీద ఉంటున్నారని సమాచారం.
కర్నాటక రాజకీయాల్లో పాతుకుపోయిన యడియూరప్పను కదిలించడం బీజేపీకి అంత వీజీఏమీ కాదు. లింగాయత్ వర్గాన్ని కాదని బీజేపీ తదుపరి అడుగులు వేయలేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ ముందుగానే పసిగట్టిన బీజేపీ… లింగాయత్ వర్గం నుంచే మరో నేతను తెరపైకి తేవడానికి శతథా ప్రయత్నిస్తున్నారని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు. ప్రజల్లో విశేష ఆదరన పొంది, క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకు పోయిన లింగాయత్ నేతను తెరపైకి తేనున్నట్లు తెలుస్తోంది. కాదంటే… రాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా మార్చేయాలన్న ఆలోచన అధిష్ఠానానికి ఉంటే బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను తెరపైకి తేవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎవర్ని ఎంపిక చేసినా… సంఘ్ మూలం ఉన్న వ్యక్తినే ఎంపిక చేయనుంది. ఈ సమీకరణాలతో పాటు.. డీకే శివకుమార్, సిద్దరామయ్య లాంటి ఉద్ధండులను తట్టుకునే నేతనూ ఎంపిక చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. మరోవైపు ఇప్పటికే యడియూరప్పను అధిష్ఠానం చాలా తగ్గిస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో యడియూరప్పను పూర్తిగా అధిష్ఠానం పక్కన పెట్టేసింది. యడియూరప్ప ఓ జాబితాను ఖరారు చేసి ఢిల్లీకి పంపితే… అధిష్ఠానం మరో జాబితాను రూపొందించి యడియూరప్పకు పంపింది. దీంతో ఆయన ఖిన్నుడయ్యారు.
చక్రం తిప్పిన బి.ఎల్. సంతోశ్
బీజేపీలో అత్యంత పవర్ ఫుల్ పోస్ట్ జాతీయ సంఘటనా కార్యదర్శి. మరో విధంగా చెప్పాలంటే ఆర్గనైజింగ్ సెక్రెటరీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు, బీజేపీకి మధ్య అనుసంధాన కర్తగా ఈ నేత పనిచేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు పార్టీని కార్యక్షేత్రంలో విస్తరించే పనిలో బిజీగా ఉంటారు ఈ పదవిలో ఉన్నవారు. గతంలో ఈ పోస్టులో సంఘ సీనియర్ ప్రచారక్ రాంలాంల్ ఉండేవారు. వివిధ రాజకీయ సమీకరణాల రీత్యా ఆయన్ను సంఘ్ వెనక్కి పిలిచింది. తిరిగి ఆరెస్సెస్‌లో సేవలందించాలని కోరింది. రాంలాల్ వెనక్కి వెళ్లగానే ఆ పోస్టులోకి బి.ఎల్. సంతోశ్ ఎంటర్ అయ్యారు. బి.ఎల్. సంతోశ్ చాలా మేధావిగా ముద్ర పడ్డారు. అంతేకాకుండా కార్యక్షేత్రంలో సైలెంట్‌గా పనిచేస్తూ… అత్యంత నిజాయితీ, సైద్ధాంతికతతో పనిచేసే నేతలను, కార్యకర్తలను ప్రోత్సహిస్తారన్న పేరూ ఉంది.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఈయననే కీలక పాత్ర పోషించారు. సీఎం యడియూరప్ప చాలా ‘హై ప్రొఫైల్’ ఉన్న నేతల పేర్లు, పారిశ్రామిక వేత్తల పేర్లను ఢిల్లీకి పంపించారు. బి.ఎల్. సంతోశ్ మాత్రం చాలా చాలా ‘లో ప్రొఫైల్’ ఉన్న నేతల పేర్లను, కార్యక్షేత్రంలో సైద్ధాంతికంగా పోరాడేవారి పేర్లను హస్తినకు పంపారు. బి.ఎల్. సంతోశ్ పంపిన జాబితాకు అధిష్ఠానం ఆమోదముద్ర వేసింది. సీఎం యడియూరప్ప పంపిన జాబితాను వెనక్కి పంపింది. అప్పటి నుంచే యడియూరప్ప ప్రాభవం అధిష్ఠానం వద్ద తగ్గిపోయిందని తెలుస్తోంది. కానీ.. అత్యంత సమర్థుడు, సీనియర్లను తట్టుకొని రాజకీయం నెరిపే నేత దొరికేంత వరకూ సీఎం కుర్చీలో యడియూరప్పనే కొనసాగించాలని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా…. బీజేపీ ముందు జాగ్రత్తగా వ్యూహం వేస్తోందని బెంగళూరు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. యడియూరప్పను బుజ్జగించడానికి ఏ రాష్ట్రానికో ఆయన్ను గవర్నర్‌గా పంపించనున్నారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. మొత్తానికి యడియూరప్ప వారసుడ్ని మార్చే విషయంలో అధిష్ఠానం ఎలాంటి బహిరంగ సంకేతాలు ఇవ్వకపోయినా… లోలోపల, సైలెంట్‌గ పని కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది.













