షిర్డీ సాయిబాబా ఆలయం రాత్రి 8 గంటల నుంచి మూసివేత
మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి మూసి వేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆలయాన్ని మూసే ఉంచుతారు. సాయిబాబా ఆలయంతో పాటు, ప్రసాదాలయం, భక్తి నివాస్‌ను కూడా మూసేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాక్షిక లాక్‌డౌన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం విధించడంతో షిర్డీ సాయి ఆలయ నిర్వాహకులు ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో విధించినటువంటి ఆంక్షలనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అణలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ ఆదివారం నిర్ణయించింది. ఏప్రిల్ 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వారాంతపు లాక్డౌన్లు, రోజంతా 144 సెక్షన్ అమల్లోకి తెస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకూ సరైన కారణాలు లేకుండా పౌరులు ఇళ్లు విడిచి వెళ్లరాదు. కర్ఫ్యూ నిబంధనల నుంచి నిత్యవసర సేవలను మాత్రం మినహాయించారు.. కెపి













