న్యాయ వ్యవస్థలో అరుదైన ఘట్టం… ఒకేసారి 68 మంది!
దేశంలోని 12 హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజయం ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. భారత న్యాయ చరిత్రలో ఒకేసారి ఇంతమంది జడ్జిలను సిఫారసు చేయడం ఇదే తొలిసారి. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ కూడా ఈ కొలీజయంలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 112 మంది పేర్లను పరిగణనలోకి తీసుకున్న కొలీజయం 68 మంది పేర్లను సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో 44 మంది బార్‌కు చెందిన వారు కాగా, 24 మంది జ్యుడిషియల్ సర్వీసుకు చెందినవారు. సిఫారసు చేసిన జాబితాలో పదిమంది మహిళలు కూడా ఉన్నారు. న్యాయమూర్తుల కొరతతో దేశంలోని వివిధ హైకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజయం జడ్జిల భర్తీ పక్రియను వేగవంతం చేసింది.













