శశికళ సంచలన నిర్ణయం… రాజకీయాలకు గుడ్ బై
తమిళనాడులో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని, డీఎంకేను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలిత బతికి ఉన్నప్పుడు కూడా నేనెప్పుడూ అధికారంలో లేను. ఆమె మరణానంతరం కూడా ఆ పనిచేయలేదు. నేను రాజకీయాల నుంచి నిష్రమిస్తున్నా.. కానీ ఆమె పార్టీ గెలవాలని, వారసత్వం కొనసాగాలని ప్రార్థిస్తున్నా, అన్నాడీఎంకే మద్దతుదారులంతా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను ఓడించేందుకు కలిసి పనిచేయాలి. జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయాలని పార్టీ క్యాడర్ను కోరుతున్నా అని పేర్కొన్నారు. ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శశికళ తిరిగి అన్నాడీఎంకేలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.













