మొదట ఈ సలహా వారికి ఇవ్వండి.. తర్వాత
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంఖర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. చైర్మన్ నిష్పక్షపాతంగా ఉండాలంటూ చురకలంటించింది. హోమియోపతి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ చైర్మన్ లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. విదేశీ పర్యటన సమయంలో రాజకీయ అద్దాలను వదిలివేయాలన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. మొదట మీరు 2015లో ఈ అభ్యాసాన్ని ప్రారంభించిన వారికి ఈ సలహా ఇవ్వండి. ఆ తర్వాత ఇతరులకు ఉపన్యాసం ఇవ్వండంటూ చురకలంటించారు. చైర్మన్ ఎప్పుడూ నిష్పాక్షపాతంగా వ్యవహరించాలని, ప్రభుత్వాన్ని ఎప్పడూ పొగడకూడదన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లండన్ పార్లమెంట్లో మాట్లాడుతూ భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు వివాదస్పద అంశాలను లేవనెత్తిన సమయంలో మైక్‌లను స్విచ్ ఆఫ్ చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దేశంలో దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది.













