తల్లి ఆకాంక్షలకు రాహుల్ గాంధీ బాధితుడు: కంగనా రనౌత్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత, మండి నియోజకవర్గ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను సోనియా గాంధీ ఇబ్బంది పెడుతున్నారని, వారి మనసుకు నచ్చినట్లు జీవించనివ్వడం లేదని సోనియా గాంధీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘3 ఇడియట్స్ సినిమాలో చూపించినట్లే.. కుటుంబసభ్యుల వల్ల పిల్లలు ఇబ్బందిపడుతుంటారు. రాహుల్‌ది కూడా అదే పరిస్థితి. రాజకీయాల్లోనే ఉండాలని తల్లి సోనియాగాంధీ ఒత్తిడి చేస్తుండడం వల్లే రాహుల్, ప్రియాంక రాజకీయాల్లో ఉన్నారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్ బాధితుడయ్యారు. వారిపై సోనియాగాంధీ ఒత్తిడి చేయకుండా వారిద్దిరినీ వారి వారి ఇష్టాలకు తగ్గట్లు, మనసుకు నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ కల్పించాలి’’ అంటూ కంగన వ్యాఖ్యానించారు. అలాగే రాహుల్ వయసు 50 సంవత్సరాలు దాటినప్పటికీ.. ప్రతిసారీ యువ నేతగా రీలాంచ్ అవుతుంటారని, ఆయన చాలా ఒత్తిడిలో ఉన్నారని, ఒంటరితనంతో బాధ పడుతున్నారని, ఒకవేళ ఆయన నటనలో ప్రయత్నించి ఉంటే.. కచ్చితంగా గొప్ప నటుడు అయ్యుండేవారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ ఓ మహిళతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడనే రూమర్లు కూడా తాను విన్నానని, కానీ ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడమే తనకు అర్థం కావడం లేదన్నారు.
ఇదిలా ఉంటే బాలివుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లలో ట్యాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న కంగన.. ఈ మధ్య కాలంలో సినిమాలకంటే రాజకీయంగానే బాగా పాపులర్ అవుతున్నారు. తాజాగా బీజేపీలో చేరిన ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ టికెట్ దక్కించుకున్నారు. బీజేపీలో చేరడంపై మాట్లాడుతూ.. 20 ఏళ్లు సినీ పరిశ్రమలో ఉన్న తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని, ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరానని పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీని ప్రపంచం మెచ్చిన నేతగా అభివర్ణించిన కంగన.. మహిళల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు మోదీ అని, దేశంలోని మహిళలు కూడా అదే భావిస్తున్నారని అన్నారు.













