‘ఆన్ లాక్’ తొందరొద్దు… జాగ్రత్త సుమా… ఐసీఎంఆర్ సూచనలు

కోవిడ్ కట్టడికి ఆయా రాష్ట్రాలు అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ఎత్తేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. రాబోయే థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుంటూ, లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని సూచించారు. చాలా నెమ్మదిగా, క్రమంగా, దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని ఐసీఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధనలు పాటించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రతి వారం పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండాలి. 70 శాతం వ్యాక్సినైజేషన్ పూర్తైన ప్రాంతాల్లో లాక్‌డౌన్ తొలగించవచ్చని సూచించింది. తమవంతు బాధ్యతగా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో మాత్రం లాక్‌డౌన్ ఉప సంహరించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మూడు అంశాలను పరిశీలించి అన్‌లాక్ చేయాలని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ సూచించారు.
ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని క్రమంగా పెంచుతున్నాయి. అయితే మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు క్రమంగా అన్‌లాక్ చేయడంపై దృష్టి సారించాయి. దశలవారీగా అన్‌లాక్ చేస్తామని సీఎంలు ఉద్ధవ్, అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ పై సూచనలు చేసింది.