తగ్గిన ప్రధాని మోదీ ప్రజాదరణ..

కరోనా నివారణకు తగిన ఏర్పాట్లు చేయలేదన్న కారణంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూ లేని కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒక అమెరికా సంస్థ, మరో దేశీయ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ వారంలో మోదీ రేటింగ్ 63 శాతంగా ఉంది. ఏప్రిల్‍లో అయితే 22 పాయింట్ల మేర తగ్గింది. ఆయన మద్దతు వర్గంలో క్రమేణా తగ్గుదల కనిపిస్తోంది. ఈ సంస్థ 12 మంది ప్రపంచస్థాయి నాయకుల రేటింగ్‍ను పరిశీలిస్తుంటుంది. 2019 ఆగస్టు నుంచి మోదీకి ఉన్న ప్రజాదరణపై సర్వే చేస్తోంది. దేశీయ సంస్థ సీవోటర్ జరిపిన సర్వేలోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. మోదీ పాలన చాలా బాగుంది అని గత ఏడాది 65 శాతం మంది చెప్పగా, ఈ ఏడాది అది 37 శాతానికి పడిపోయింది.