ఏరో ఇండియా ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన మొదలైంది. బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ఏరో ఇండియా 2023 షోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం పలు విమానాల విన్యాసాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందన్నారు. నవ భారత సామర్థ్యాలను చాటిచెప్పేందుకు బెంగళూరు గగనతలం వేదికైంది. ఏరో ఇండియా బన బలాన్ని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే భారత్‌పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతోంది. ఇప్పుడు విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు మన దేశం మార్కెట్ మాత్రమే కాదు, ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్ ముందడుగు వేస్తోంది అని మోదీ వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తదితరులు పాల్గొన్నారు.













