Ozempic: భారత్‌లోకి ‘ఒజెంపిక్’.. డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్
ప్రపంచ వైద్య రంగంలో సంచలనం సృష్టించిన మందు ‘ఒజెంపిక్’ (Ozempic). పాశ్చాత్య దేశాల్లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఈ ఇంజెక్షన్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘నోవో నార్డిస్క్’ (Novo Nordisk) ఈ ఔషధాన్ని ఇండియాలో విడుదల చేసింది. ప్రధానంగా టైప్-2 డయాబెటిస్ నియంత్రణ కోసం రూపొందించిన ఈ మందు, ఇప్పుడు భారతీయ రోగులకు ఒక కొత్త ఆశను కల్పిస్తోంది.
దీని అసలు పేరు సెమాగ్లుటైడ్ (Semaglutide). ఇది మన శరీరంలో సహజంగా ఉండే GLP-1 అనే హార్మోన్లా పనిచేస్తుంది. ఇది రెండు విధాలుగా పని చేస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో షుగర్ పెరగకుండా, క్లోమ గ్రంథి నుండి తగినంత ఇన్సులిన్ విడుదలయ్యేలా చేస్తుంది. కాలేయం (Liver) నుంచి అనవసరంగా గ్లూకోజ్ విడుదల కాకుండా అడ్డుకుంటుంది. తద్వారా డయాబెటిస్ రోగుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి.
కేవలం షుగర్ కోసమే కాదు.. గుండె, కిడ్నీలకు రక్షణ కవచంలా పని చేస్తుందని చెప్తున్నారు. సాధారణంగా డయాబెటిస్ మందులు షుగర్‌ను మాత్రమే తగ్గిస్తాయి. కానీ ఒజెంపిక్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది డయాబెటిస్ వల్ల వచ్చే ప్రాణాపాయ ముప్పుల నుంచి కూడా కాపాడుతుంది. దీర్ఘకాలికంగా డయాబెటిస్ ఉన్నవారికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒజెంపిక్ వాడకం వల్ల ఈ కార్డియోవాస్కులర్ ముప్పు దాదాపు 26శాతం వరకు తగ్గుతుందని అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ నిరూపించాయి. అధిక షుగర్ వల్ల కిడ్నీలు పాడవడం సహజం. ఈ మందు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తూ, డయాలసిస్ వరకు వెళ్ళే పరిస్థితిని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో దీన్ని “వెయిట్ లాస్ డ్రగ్”గా ప్రచారం చేస్తున్నారు. నిజానికి, ఈ మందు తీసుకున్నప్పుడు మెదడుకు ‘కడుపు నిండింది’ అనే సంకేతాలు వెళ్తాయి. ఆకలి తగ్గుతుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల డయాబెటిస్ రోగులు బరువు తగ్గుతారు. ఊబకాయం తగ్గడం వల్ల షుగర్ మరింత బాగా కంట్రోల్ అవుతుంది. అయితే, ఇండియాలో దీన్ని అధికారికంగా ‘డయాబెటిస్ మందు’గానే అనుమతించారు తప్ప, కాస్మెటిక్ వెయిట్ లాస్ డ్రగ్‌గా కాదు. ఇది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్. పెన్ రూపంలో ఉంటుంది కాబట్టి, రోగులే స్వయంగా వేసుకోవచ్చు. నాలుగు వారాలకు అంటే నెలకు రూ. 8,800లుగా నిర్ణయించారు. ప్రస్తుతం 0.25 mg, 0.5 mg, 1 mg డోసుల్లో ఇది లభిస్తుంది. డోసు పెరిగే కొద్దీ ధర కూడా రూ.10వేలు దాటుతుంది.
ఇది ఎంత గొప్ప మందైనా, సొంత వైద్యం మాత్రం పనికిరాదు. దీన్ని వాడేవారిలో మొదట్లో వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. కేవలం ఎండోక్రైనాలజిస్ట్ లేదా డాక్టర్ల సూచన మేరకే దీన్ని వాడాల్సి ఉంటుంది. మొత్తానికి, భారత్ డయాబెటిస్ క్యాపిటల్ గా మారుతున్న తరుణంలో, గుండె, కిడ్నీలను కాపాడుతూ షుగర్‌ను నియంత్రించే ‘ఒజెంపిక్’ రాక కచ్చితంగా ఒక శుభవార్తే!






