భళా భారత్.. ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం సక్సెస్
భారత నావికా దళం దేశ భద్రతలో మరో మైలురాయిని చేరుకుంది. అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి విజయవంతంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. శుక్రవారం నాడు ఈ కీలకమైన పరీక్షలో విజయం సాధించినట్లు ప్రకటించింది. అణు జలాంతర్గామి ద్వారా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి.. బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవతంగా ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇలా జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం (ఎస్ఎల్బీఎం) విజయవంతం అవడంతో.. భారత నౌకాదళ అణు నిరోధకత, దేశ అణు సాంకేతికత విశ్వనీయత మరోసారి రుజువయ్యాయని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రయోగ ఫలితం ఆధారంగా.. చైనా, పాకిస్థాన్ వంటి శత్రుదేశాలకు చెందిన సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సముద్ర జలాల కింది నుంచి ధ్వంసం చేసే సామర్ధ్యాన్ని భారత నావికా దళం సాధించింది.













