బల పరీక్షలో నీతీశ్ విజయం …విపక్షం వాకౌట్
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్ బీహార్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలంటే 122 మంది ఎమ్మెల్యే మద్దతు అవసరం. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా నితీశ్ కుమార్కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. దాంతో నితీశ్ సర్కారు బలపరీక్ష నెగ్గింది. కాగా, విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా విపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. దాంతో సభలో మిగిలిన 129 మంది ఎమ్మెల్యేలు తీర్మానానికి మద్దతుగా ఓటువేశారు. విపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు.
జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ గత నెల 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్జేడీతో కలిసి ఆయన ఏర్పాటు చేసిన మహాకూటమి ప్రభుత్వం పతనమైంది. అనంతరం బీజేపీతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేరోజు ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేడు బలపరీక్షలో నెగ్గారు.













