కేరళలో మళ్లీ నిఫా అలజడి.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన కర్ణాటక
కేరళను మరోసారి నిఫా వైరస్ కలవరపెడుతోంది. ఇక్కడ ఒక్కొక్కటిగా నిఫా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేరళ పక్కన ఉండే దక్షిణ ప్రాంత జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, కేరళ నుంచి వచ్చే పండ్ల వాహనాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని పోలీసు అధికారులను వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. ఈ నిఫా అలజడి నేపథ్యంలో మంగళూరు పరిధిలోని 8 మెడికల్ కాలేజీల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వైద్యాధికారి సుదర్శన్ తెలియజేశారు. బ్రెయిన్ ఫీవర్ అని అనుమానం ఉన్న కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జిల్లాల్లోని తాలూకా ఆస్పత్రులు, ప్రాథమిక ఆస్పత్రుల పరిధిలో ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ‘వెన్లాక్ హాస్పిటల్ సహా పలు ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశా. నిఫా, బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదైతే ఈ విషయాన్ని వెంటనే మా దృష్టికి తీసుకురావాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచనలు చేశాం. ఇప్పటి వరకైతే దక్షిణ కర్ణాటకలో నిఫా కేసులు రాలేదు. కేరళలో ఈ వైరస్ కారణంగా ఇటీవల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే వైరస్ కట్టడికి తగిన చర్యలన్నీ తీసుకుంటున్నాం’ అని వైద్యశాఖ అధికారులు తెలియజేశారు.













