అన్నీచోట్లా బిజెపి హవా
దేశ వ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ హవా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉప ఎన్నికలు జరుగుతున్న మొత్తం 8 స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే సిట్టింగ్ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ లోటును బీజేపీ పూడ్చుకుంది.
కర్ణాటకలోనూ అధికార బీజేపీ అనుహ్య ఫలితాలను సాధించింది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆర్ఆర్ నగర్, శిర అసెంబ్లీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఈ రెండు స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మరింత పెరుగనుంది.
మధ్య ప్రదేశ్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 21, కాంగ్రెస్ 6, బీఎస్పీ 1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కినట్లైంది. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు.













