ఆ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదు…ఢిల్లీ హైకోర్టు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిల్‍ను హైకోర్టు కొట్టేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్‍కు లక్ష రూపాయల జరిమానాను విధించింది. దీంతో కేంద్రానికి మరో ఊరట లభించింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ పనులు నిలిపివేయాలని కోరుతూ డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్, చరిత్రకారుడు సోహైల్ హష్మీ, ట్రాన్సలేటర్ అన్యా మల్హోత్రా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‍పై హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ప్రాజెక్టు చట్టబద్ధతను ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్థించిందని, నిర్మాణ పనులను ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇప్పటికే కూలీలు కూడా సైట్ వద్ద ఉన్నారని తెలిపింది. అందువల్ల నిర్మాణ పనులను ఆపేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ పిటిషన్‍ను కొట్టివేసింది.