విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
కరోనా కేసులు ఉధృతరూపం దాలుస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు నడుం బిగించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను సవరించింది. కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలంటూ శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు అందేవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిబంధన విధించింది. ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా విజృంభిస్తున్న ఎట్‌రిస్క్ దేశాల జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. అవి..యూకే సహా అన్ని యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్ న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా.













