నచ్చని ఎమ్మెల్యేలను దించేద్దాం…
ఏదోలా గెలవాలి చట్ట సభల్లో అడుగుపెట్టాలి. అంతే. ఒక్కసారి గెలిస్తే 5 సంవత్సరాలు పాటు ఢోకా లేదు. హామీ ఇచ్చిన పనులు చేసినా.. చేయకపోయినా ప్రశ్నించేవారేరీ.. ఒకవేళ అడిగినా చేస్తే చేస్తాం.. లేకపోతే లేదు. ఎప్పుడో ఓసారి నియోజకవర్గానికి వెళ్లి అలా కనిపించి వస్తే సరి.. మళ్లీ జనంతో అవసరం వచ్చేది ఐదేళ్లకు కదా.. చివరి ఏడాదిలోనో, ఆర్నెళ్లోనో చక్రం తిప్పితే సరి. భారతదేశంలో ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల్లో అత్యధికుల ఆలోచనలు ఇలాగే సాగుతుంటాయి. అయితే.. నియోజకవర్గం అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులకు త్వరలోనే షాక్ తగలనుందా.. రీకాల్ ఆఫ్షన్ దిశగా కేంద్రం ఆలోచిస్తుందా.. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
లోక్సభలో రీకాల్ బిల్లు…
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారు ఆశించిన విధంగా సరిగా పని చేయకపోతే.. రీకాల్ చేసే అధికారం ఓటేసిన ప్రజలకు ఉండాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అంటున్నారు. దీనిపై లోక్ సభలో ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. నియోజకవర్గాల్లో పనిచేయని ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకు ఇవ్వాలనేది ఆయన డిమాండ్. ఇందులో భాగంగానే.. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ 1951 చట్టానికి 2016లో పార్లమెంట్ సభ్యులు సవరణలు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రైట్ టు రీకాల్ ను ఓ ప్రైవేట్ బిల్ గా పెట్టబోతున్నట్టు ప్రకటించారు.
రీకాల్.. ఇలా..
ఈ రీకాల్ బిల్ చట్టంగా మారితే.. సంబంధిత ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన వ్యక్తి.. డైరెక్టుగా స్పీకర్ కు పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ కు సూచిస్తారు స్పీకర్. విచారణలో పిటీషన్ వ్యక్తి చెప్పిన విషయాలు వాస్తవం అని నిర్ధారణ అయితే.. EC సంబంధిత ఎమ్మెల్యేపై రీకాల్ కోసం ఓటింగ్ నిర్వహిస్తుంది. అందులో 75 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేస్తే.. అతని పదవి ఊడిపోవడం గ్యారంటీ. ఈ బిల్ సామాన్యుడికి దక్కనున్న బ్రాహ్మాస్త్రం అంటున్నారు నిపుణులు. రైట్ టు రీకాల్ బిల్ చట్టంగా మారితే ఎన్నికైన రెండేళ్లలోపే ఎమ్మెల్యే పదవి కోల్పోవచ్చు. అధికారం ఇచ్చిన వారి చేతిలోనే దాన్ని ఊడబెరికే అస్త్రం కూడా పెడితే… అది దేశ రాజకీయాలను సమూలంగా మార్చేయడం తధ్యం.













