క్వాడ్ సదస్సుకు వెళ్లనున్న ప్రధానికి ..ఎస్ఎఫ్జే బెదిరింపులు
ప్రధాని నరేంద్ర మోదీకి సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే ఖలిస్థానీ ఉగ్రసంస్థ బెదిరింపులకు దిగింది. క్యాడ్ నేతల సదస్సుకు ఈ నెల 24న ప్రధాని అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదస్సు జరిగే రోజున శ్వేత సౌధం ముందు ఆందోళన నిర్వహిస్తామని ఎస్ఎఫ్జే ప్రకటించింది. రైతులపై హింసకు వ్యతిరేకంగానే ఈ నిరసన అని తెలిపింది. అయితే ప్రధాని భద్రతా విభాగం స్పందించింది. కేవలం ప్రచారం కోసమే ఎస్ఎఫ్జే వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసిందని పేర్కొంది. అందులో ఎక్కువ మంది పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లే ఉన్నారని తెలిపింది. వారు నిరసన చేసే అవకాశాలున్నాయని వెల్లడించింది.
గత కొన్నేళ్లుగా డార్క్ వెబ్‌లో వెబ్ సైట్లను క్రియేట్ చేయడంతో పాటు అభ్యంతరకర సందేశాలను ఎస్ఎఫ్ జే పోస్ట్ చేస్తోంది. ఇప్పటిక అందులో కొన్నింటిని తొలగించారు. రైతు ఉద్యమం సందర్భంగా వారిని ఆకర్షించే ప్రయత్నమూ చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే డబ్బు ఇవ్వడంతో పాటు విదేశీ పౌరసత్వం కూడా ఇప్పిస్తామని ఆశ చూపించారు. ఈ నేపత్యంలో 2019 జులై 10న ఎస్ఎఫ్ జేపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.













