కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రూ.10 వేల జరిమానా వేసిన హైకోర్టు
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు ఈ ఫైన్ విధించినట్లు కోర్టు వెల్లడించింది. ఈ ఘటన బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అప్పట్లో సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి అప్పటి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కారకుడు అని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధరామయ్య సహా, కాంగ్రెస్ నేతలు రోడ్లపై ధర్నాకు దిగారు. సంతోష్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయాలని పట్టుబట్టారు. 2022లో జరిగిన ఈ ధర్నా సందర్భంగా సిద్ధరామయ్య, ప్రస్తుత రవాణా మంత్రి రామలింగారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రణదీప్ సూర్జేవాలా తదితరులు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సీఎం సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతలకు ఫైన్ విధించింది. అందులోనూ ప్రజాప్రతినిధులు అయ్యుండి ఇలా ట్రాఫిక్కు ఆటంకం కలిగించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసును కొట్టివేయాలని సిద్ధరామయ్య పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు, సీఎం సిద్ధరామయ్య ప్రజా ప్రతినిధుల కోర్టులో మార్చి 6న విచారణకు హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.













