కేంద్రం ఓకె అన్నా..షూటింగ్స్ సందేహమే…
లాక్‌డవున్ నిబంధనలు సడలిస్తూ కొనసాగుతున్న అన్‌లాక్ 4లో భాగంగా.. దేశవ్యాప్తంగా సినీమాలు, టీవీ కార్యక్రమాల షూటింగులు జరుపుకునేందుకు కేంద్రం ఆదివారం అనుమతించినప్పటికీ… సినీ పరిశ్రమలో ఆ ఉత్సాహం ఏమీ కనపడడం లేదు. ఇప్పటికిప్పుడు షూటింగ్స్ ప్రారంభించేద్దామనే ఆత్రుత సినిమా పెద్దల్లో కనపడడం లేదు. ఇంతకు ముందే సినిమా షూటింగ్స్‌పై పరిశ్రమ ప్రముఖులు మాట్లాడిన మాటలతో పాటు తాజాగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ స్పందన కూడా దీనిని బలపరిచేలాగే ఉంది.
కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పాటు షూటింగ్స్ కోసం జారీ చేసిన మార్గదర్శకాలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కొత్తవేమీ కాదని, అందులో ఎలాంటి బెనిఫిట్స్ లేవని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ రాకుండా షూటింగ్స్ లో పాల్గొనడానికి హీరోలు, టెక్నీషియన్లు ముందుకు రారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేసి డబ్బులు పోగొట్టుకోవడానికి నిర్మాతలు రెడీగా లేరని సి.కల్యాణ్ స్పష్టం చేశారు.
కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు జీవోలు ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్ సాధ్యమయే పని కాదని తేల్చి చెప్పారు. గతంలో హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్స్ ప్రారంభం కాకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్లో అమితాబ్ సైతం కరోనా బారిన పడిన ఉదాహరణలున్నప్పుడు.. అలాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తడానికి అవకాశం ఇవ్వడం సరైంది కాదన్నారు. దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపధ్యంలో కేంద్రం ఇచ్చిన అనుమతులు సినీ పరిశ్రమలో ఎలాంటి ఉత్సాహాన్ని నింపలేదని, కరోనాకు వ్యాక్సిన్ వస్తేనే చిత్ర పరిశ్రమకు ఊపొస్తుందనేది నిస్సందేహం.













