రామ మందిరాన్ని పేల్చేస్తాం … ఉగ్రవాద సంస్థ హెచ్చరిక

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ద ఆలయానికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించినట్లు ఓ ఆడియో సందేశం లీక్ అయ్యింది. రామ మందిరంపై బాంబులతో దాడి చేస్తామంటూ ఆ ఆడియోలో ఉన్నట్లు తెలిసింది. జైషే సంస్థ హెచ్చరికలతో అయోధ్య పోలీసులు అప్రమత్తం అయ్యారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రామ మందిరానికి ఇలా బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. 2023లోనూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ బెదిరింపులు బూటకమని తెలిపింది.