మహారాష్ట్ర పరిస్థితిపై కేంద్రం ఆందోళనగా ఉంది : వీకే పాల్
మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న విషయంలో కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు క్రియాశీలకంగా ఉన్న 10 జిల్లాల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఈ 10 జిల్లాల్లో 8 జిల్లాలు కేవలం మహారాష్ట్రలోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అందరూ కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని, ప్రభుత్వాలకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కోవిడ్ పరిస్థితిపై కేంద్రం ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా కేసులున్నాయని పేర్కొంది. పూణె, నాగపూర్, థానే, ముంబై, అమరావతి, జల్గావ్, నాసిక్, ఔరంగాబాద్ జిల్లాలో యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.
అయితే కేరళ, యూపీ రాష్ట్రాల్లో మాత్రం కేసులు తగ్గుతున్నాయని ఊరట కల్పించే ప్రకటనను చేసింది. దేశంలో ఇప్పటి వరకూ 2.56 కోట్ల మందికి పైగానే టీకా పంపిణీ పూర్తైందని కేంద్రం వెల్లడించింది. అయితే మరణాల రేటు మాత్రం తగ్గిందని, రికవరీల రేటు పెరిగిందని తెలిపింది. ‘‘మహారాష్ట్ర పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు చేరుకునే సమయానికి నాగపూర్‌లో లాక్డౌన్ అన్న ప్రకటన వచ్చింది. దీన్ని బట్టే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇదే విషయంపై కేంద్రం తీవ్ర ఆందోళనలో ఉంది.’’ అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. నాగపూర్‌లో ఒక్కరోజులోనే 1800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సర్కార్ అక్కడ లాక్డౌన్ విధించింది.













