అధ్యక్షుడు ఎవరైనా భారత్ కు ఓకే!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలనగానే ప్రపంచంలోని ప్రతి దేశం లాభనష్టాల బేరీజు వేసుకోవటం పరిపాటి. అగ్రరాజ్యం అధినేతగా ఎవరు ఎన్నికైతే లాభం, ఎవరితో నష్టం అనే లెక్కలు చాలా దేశాలు వేసుకుంటుంటాయి. తాజాగా ఎన్నికల నేపథ్యంలో భారత్లో కూడా అలాంటి లెక్కలు, విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం అధ్యక్ష పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, బిడెన్ ఇద్దరూ భారత్కు మంచి మిత్రులనే పేరు ఉన్నది. ట్రంప్ నాలుగేండ్ల పాలనలో వాణిజ్యపరంగా భారత్కు పెద్దగా ప్రయోజనాలు కలుగకపోయినప్పటికీ మన ప్రధాని మోదీకి మంచి మిత్రుడిగా ఉన్నారు. ఒబామా పాలనలో ఎనిమిదేండ్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బిడెన్, రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగేందుకు కృషి చేశారు. వ్యూహాత్మకంగా భారత్తో అమెరికా స్నేహం చేయటానికే మొగ్గుచూపుందని నిపుణులు అంటున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెత్తనాన్ని అడ్డుకోటానికి అమెరికాకు భారత్ సాయం తప్పనిసరని పేర్కొంటున్నారు.













