అమెరికాలో అక్రమ ప్రవేశానికి.. రూ.లక్షల్లో చెల్లింపు
అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి తోడ్పడితే రూ.60 నుంచి 80 లక్షల వరకు ముట్టజెప్పడానికి సిద్ధమైన గుజరాతీల వైనం బయటపడింది. ఇటీవల 303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న ఓ అద్దె విమానాన్ని వారంరోజుల క్రితం ఫ్రాన్స్‌లో నిలిపేసిన సంగతి తెలిసిందే. వారిలో 260 మది భారతీయులు కాగా, అందులోనూ 66 మంది గుజరాత్‌కు చెందినవారు. ఫ్రాన్స్‌లో నాలుగు రోజులు చిక్కుకుపోయిన వారి విమానం డిసెంబరు 26న ముంబయికి తిరిగి వచ్చింది. అందులోని 66 మంది గుజరాతీలలో 55 మంది తమను దుబాయ్, నికరాగువాల మీదుగా అమెరికాలో అక్రమంగా ప్రవేశపెడితే రూ.60-80 లక్షల వరకు చెల్లిస్తామని 15 మంది స్థానిక ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుజరాత్ సీఐడీ ఎస్పీ సంజయ్ ఖారట్ తెలిపారు. ఈ గుజరాతీలలో ఎక్కువమంది 8 నుంచి 12వ తరగతి వరకు మాత్రమే చదివారు. వీరు అమెరికాకు చేరుకున్నాకే ఏజెంట్లకు డబ్బు చెల్లించేట్లు ఒప్పందం కుదిరింది. 2023లో నికరాగువా గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి 96,917 మంది భారతీయులు ప్రయత్నించారని అమెరికా అధికారులు తెలిపారు.













