సెంట్రల్ విస్టా కాదు…. దార్శనికత కావాలి : రాహుల్ ఎద్దేవా

ట్విట్టర్ వేదికగా కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ‘సెంట్రల్ విస్టా’ప్రాజెక్టు ముఖ్యం కాదని, దూరదృష్టి, దార్శనికతతో కూడిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. కోవిడ్ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోందని, ఈ సమయంలో సెంట్రల్ విస్టాపై దృష్టి సారించకుండా దార్శనికతతో వ్యవహరించాలని రాహుల్ సూచించారు. రోగులకు ఆక్సిజన్ సైతం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టి నూతన పార్లమెంట్ భవన నిర్మాణంపై కాకుండా, దూరదృష్టితో ఉండాలన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో మానవులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారని ప్రశంసించారు. ఇలా సాయం చేసుకుంటూ పోయే చేతులను మరింత పెంచాలని, ఈ గుడ్డి వ్యవస్థ నిజ స్వరూపాన్ని ప్రజలందరూ బయటపెట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు.
ఏమిటీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్?
రాజ్‌పథ్‌కు రెండు వైపులా ఉన్న ప్రాంతాన్ని సెంట్రల్ విస్టా అంటారు. ఇందులో రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ దగ్గరున్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతం కూడా ఉంటాయి. నేషనల్ మ్యూజియం, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఉద్యోగ భవన్, బిగనేర్ హౌజ్, హైదరాబాద్ హౌజ్, జవహర్ భవన్లు కూడా ఉన్నాయి. ఈ భవనాలన్నింటికీ కొత్త రూపం ఇచ్చే ప్రణాళిక. మొత్తం 14 వేల కోట్ల రూపాయలు. దీనిని ప్రకటించిన తర్వాతే మోదీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.