వేగవంతమైన అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారు : ప్రధాని మోదీ
దేశ ప్రజలు వేగవంతమైన అభివృద్ధిని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రజలు దేనిని కోరుకుంటున్నారో దానిని అందులో పొందుపరిచారని కితాబునిచ్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడ్జెట్ పై సకారాత్మక స్పందన వచ్చిందని పేర్కొన్నారు. బడ్జెట్ పై దేశ ప్రజల మానసిక స్పందన ఎలా వుంటుందో, పసిగట్టి, దాని ఆధారంగానే రూపొందించామని తెలిపారు. దేశం వేగంగా మార్పు చెందాలని కోరుకుంటోందని, సమయాన్ని ఏ మాత్రం వృథా చేయకూడదన్న భావనలో ఉందని తెలిపారు. ఈ సంవత్సరపు బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కోసం చాలా కేటాయించామని, అది భారత ఆర్థిక వ్యవస్థ లంఘించడానికి దోహదపడుతుందని నొక్కి వక్కానించారు. అంతేకాకుండా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని, వీటి ద్వారా దేశంపై చాలా ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర భారత్ అంటే కేవలం స్వావలంబన మాత్రమే కాదని, ప్రపంచ దేశాల అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. యువకుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సి ఉంటుందని, జిల్లా స్థాయిలో ఉన్న ప్రత్యేకతల్ని కూడా గుర్తించి, ఉత్పత్తి చేయాల్సిన వస్తు జాబితాను రూపొందిస్తే బాగుంటుందని సూచించారు.
కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయని మరోసారి ప్రశంసలు కురిపించారు. అన్ని రాష్ట్రాలూ కలిసి ఏకత్రీకరంగా పనిచేయడం మూలంగా కోవిడ్‌ను అడ్డుకోగలిగామని, దీని ద్వారా ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ద్వారా సమాఖ్య వ్యవస్థ బలపడుతుందని, కేవలం రాష్ట్రాల మధ్యే కాకుండా జిల్లాల మధ్య కూడా ఇలాంటి ఆరోగ్యవంతమైన ఫెడరలిజం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం ద్వారా దేశాభివృద్ధి స్థిరంగా ఉంటూ, పురోగమనానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విధానపరమైన సహకారం ఎంతో అవసరమని మోదీ సూచించారు.
ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి : రాష్ట్రాలకు మోదీ సూచన
ప్రైవేట్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలకు సూచించారు. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్గాలెక్కించడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. అవి ఎదగకుండా పాతుకుపోయిన, తుప్పుపట్టిన చట్టాలను రద్దు చేసి, వాటి స్థానే కొత్త చట్టాలను రూపొందించాలని సూచించారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రైవేట్ రంగం ఎదుగుదలకు దోహదపడే విధంగానే ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. సాంకేతికంగా దేశం బాగా అభివృద్ధి చెందిందని, ఇలాంటి సమయంలో కూడా కాలం చెల్లిన చట్టాలతో ప్రయాణం చేసి లాభం లేదని, కొత్తవి రూపొందించి, ప్రైవేట్ రంగానికి ఊతమివ్వాలని సూచించారు.
వ్యవసాయ చట్టాలు చర్చకు రాలేదు : నీతి ఆయోగ్
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో వ్యవసాయ చట్టాల విషయం అసలు ప్రస్తావనకే రాలేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం వ్యవసాయ రంగంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులు మాత్రమే చర్చకు వచ్చాయని రాజీవ్ తెలిపారు. నూతన సాగు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు తక్షణ పరిష్కారం చూపాలని తాము ప్రధానిని కోరినట్లు పంజాబ్ సీఎం పేర్కొన్న నేపథ్యంలో నీతి ఆయోగ్ ఈ ప్రకటన చేసింది. భారత్‌ను మ్యానిఫ్యాక్చరింగ్ పవర్ హౌజ్‌గా ఎలా రూపొందించాలి? భారత వ్యవసాయ రంగం, మౌలిక సదుపాయాల కల్పన, కింది స్థాయి వరకూ పరిపాలన ఎలా వెళ్లాలి? ఆరోగ్యం, పౌష్ఠికాహారం లాంటి విషయాలపైనే ఈ సమావేశం చర్చించిందని ఆయన వెల్లడించారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించాలి : సీఎం కేజ్రీవాల్
చైనాను తలదన్నేలా స్టార్టప్‌లను ప్రోత్సహించాలని, తయారీ రంగాన్ని మరింత బలపరచాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చైనా కన్నా తక్కువ ధరలోనే ఉత్పత్తులను మన దేశంలో తయారు చేసి చైనాకు సవాల్ విసరాలని ఆకాంక్షించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను బాగా ప్రోత్సహించి, వాటికి పన్ను రాయితీలు ఇస్తే గణనీయమైన మార్పు సంభవమని నొక్కి చెప్పారు. కొన్ని సంవత్సరాల పాటు దేశం తయారీ రంగంపై అసలు దృష్టే సారించలేదని, అందుకే మేనిఫేక్చరింగ్ రంగంలో భారత్ అంత వెనుకబడి ఉందని నిర్మొహమాటంగా పేర్కొన్నారు. అయితే స్టార్టప్ కంపెనీలకు రాయితీలిచ్చి, ప్రోత్సహిస్తే ఉద్యోగాల కల్పన కూడా సులభతరం అవుతుందని సూచించారు.
రైతుల భయాల్ని పోగొట్టండి : పంజాబ్ సీఎం
నూతన సాగు చట్టాల విషయంలో రైతుల భయాల్ని పోగొట్టాల్సిన అవసరం కేంద్రంపై ఉందని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. 2015 శాంత కుమార్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఎంఎస్పీ ఆధారతి సేకరణ నిలిపివేయచ్చన్న విషయంలో రైతులకు కొన్ని సందేహాలున్నాయని, వాటిని పోగొట్టాలని సూచించారు. అలాగే వరి క్వింటాల్‌కు 100 రూపాయల బోనస్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పరికరాల కొనుగోలు, నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగించే పరికరాలతో పాటు నిర్వహణ వ్యవయాన్ని కూడా తగ్గించి, ఊరటనివ్వాలని సూచించారు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం 50 శాతం సీలింగ్‌కు బదులుగా కోవిడ్ నిర్వహణ కోసం ఎస్డీఆర్ఎఫ్ 100 శాతం ఖర్చు చేయడానికి కేంద్రం అనుమతిని ఇవ్వాలని సూచించారు.













