కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
దేశంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్నది. రోజూవారీ కొత్త కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షల మార్కును కూడా దాటింది. గత రెండు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద వీటిని పంపిణీ చేయనున్నారు. మే, జూన్ నెలలకు గానూ ఒక్కొక్కరికీ ఐదు కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలను అందించనున్నారు. సుమారు 80 కోట్ల మందికి ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.26 వేల కోట్లు వెచ్చించనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వరాష్ట్రాలకు తరలిపోతున్నారు. కొందరు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.













