విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఈ నెల 24 నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మే 24 నుంచి 28 వరకు జయశంకర్ అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా ప్రభుత్వంతో పాటు కరోనా వ్యాక్సిన్ కంపెనీలతో ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. భారత్‌లో కొవిడ్ సెకండ్ వేవ్ ఉధ్ధ•తి, వ్యాక్సిన్ల కొరత ఏర్పడిన సమయంలో విదేశాంగ మంత్రి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
తొలుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో భేటీ అవుతారు. అనంతరం అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌తో చర్చలు జరుపుతారని అని భారత విదేశాంగశాఖ తెలిపింది. వీరితో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చూసే ఇతర కీలక అధికారులతోనూ జయశంకర్ భేటీ కానున్నారు. ముఖ్యంగా పలు వ్యాక్సిన్ సంస్థలతో పాటు అమెరికా-భారత్‌ల మధ్య కరోనా మహమ్మారి సంబంధిత సహకారంపై చర్చలు జరపనున్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటికే అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థలతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా పర్యటనలోనూ ఇదే విసయాన్ని ఆయా సంస్థలకు విదేశాంగశాఖ మంత్రి మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది.













