ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులు
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్తో పాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వీరితో ప్రమాణం చేయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుకుంది. ఇంక రెండే ఖాళీలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గతేడాది డిసెంబర్ 13న ఈ అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చసింది. ఈ సిఫార్సులకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కాగా మిగిలిన రెండు ఖాళీలను కూడా కొలీజియం గత నెల సిఫార్సులు పంపించింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.













