రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం.. కీలక సూచనలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. బాలకార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు వెల్లడించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ర్యాలీలు, ప్రచార కార్యకలాపాల్లో పిల్లలను చేర్చుకోవద్దు. పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, నినాదాలు, ప్రచారగీతాలు ఇలా ఎక్కడా వారిని ఉపయోగించొద్దు. ప్రచార కార్యక్రమాల్లో నేతలు చిన్నారులను ఎత్తుకోవడం, వాహనాల్లో తీసుకెళ్లడం కూడా నిషేధం అని ఈసీ తెలిపింది. అభ్యర్థులు, పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఎన్నికల సంబంధిత పనులు, కార్యకలాపాల్లో చిన్నారులను చేర్చుకోవద్దని ఎన్నికల అధికారులు, యంత్రాంగానికి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.













